ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : రాజధాని అమరావతి ప్రాంతంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ నేపథ్యంలో పాట్ల అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని సిఆర్‌డిఎ కమిషనర్ వివేక్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1402.58 ఎకరాల్లోని 25 లే అవుట్లను అభివృద్ధి చేశామని, నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరం ప్రాంతాల్లో 51,392 ప్లాట్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వీటికి పట్టాలను లబ్ధిదార్లకు ఈ నెల 26న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పంపిణీ చేస్తారని, ఇందుకుగాను ఏర్పాట్లను తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. లే అవుట్లలో అంతర్గత రవాణా వ్యవస్థకు అనుగుణంగా 76.28 కిలో మీటర్ల గ్రావెల్ రహదార్లు వేశామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన 751.93 ఎకరాల్లోని 14 లే అవుట్లు, గుంటూరు జిల్లాకు కేటాయించిన 650.65 ఎకరాల్లోని 11 లే అవుట్లు అభివృద్ధి చేపట్టి 67,700 హద్దు రాళ్లు వేసి ప్లాట్లను అందుబాటులోనికి తెస్తున్నామని వివరించారు. ఇళ్ల స్థలాల మార్కింగ్, నంబరింగ్ ప్రక్రియను రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పూర్తి చేస్తున్నామని తెలిపారు.










