Oct 13,2020 07:08

కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌లు ఎంతమాత్రం పరిష్కారం చూపబోవని, వాటికి స్వస్తి పలకాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) డైరెక్టర్‌ జనరల్‌కు ప్రత్యేక దూతగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ డేవిడ్‌ నబరో తాజాగా చేసిన హితబోధ పలు దేశాధినేతలకు కనువిప్పు వంటిది. సుదీర్ఘ లాక్‌డౌన్‌లతో సాధించేది పేదరికమేనన్న నబరో ఉద్బోధ ఇప్పటికే రుజువైంది. ఈ కాలంలో ప్రపంచ పేదల సంఖ్య రెట్టింపైందని డేవిడ్‌ మాత్రమే కాదు ప్రపంచబ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటివి సైతం కుండబద్దలు కొట్టాయి. సన్న, చిన్నకారు రైతుల బతుకులు ఛిద్రం అయ్యాయని, పర్యాటక పరిశ్రమే ఏకైక వనరుగా కలిగిన పలు దేశాలు కుప్పకూలిపోయిన వాస్తవ చిత్రాన్ని ఇప్పటి వరకు మీడియా ద్వారా లోకం గ్రహించగా, ఇప్పుడు డబ్ల్యుహెచ్‌ఒ ముఖ్య అధికారి నోట ప్రత్యక్షంగా వింటున్నాం. పౌష్టికాహార లోపం కలిగిన పిల్లల సంఖ్య రెట్టింపు అయిందన్న కఠోర సత్యం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తుంది. 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభంనాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మైనస్‌ 0.01 శాతానికి పడిపోగా, 2020 కరోనా లాక్‌డౌన్‌లో మైనస్‌ 0.3 శాతానికి దిగజారిందని డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొనడం సంక్షోభ తీవ్రతకు హెచ్చరిక.
నిరుడు నవంబర్‌లో చైనాలో బయటపడ్డ కోవిడ్‌-19 వైరస్‌ అనతికాలంలో ప్రపంచాన్ని చుట్టేసింది. దాదాపు సంవత్సర కాలంగా ఉధృతిని కొనసాగిస్తోంది. ఇప్పటికి మూడున్నర కోట్ల కేసులు పది లక్షల మరణాలు సంభవించాయి. ఇంకా రోజుకు 3 లక్షల కేసులొస్తున్నాయి. 79 లక్షల కేసులు రెండు లక్షల పైచిలుకు మరణాలతో అమెరికా మొదటి స్థానంలో, 70 లక్షల కేసులు లక్షకుపైగా మరణాలతో భారత్‌ రెండవ స్థానం వహించింది. వైరస్‌ మొదట ప్రబలిన చైనాలో కేసులు 80 వేలకు, మరణాలు నాలుగైదు వేలకు పరిమితమయ్యాయి. ఏడాది కాలంలో అనేక దేశాలు కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేశాయి, ఇంకా చేస్తున్నాయి. డబ్ల్యుహెచ్‌ఒ లాక్‌డౌన్‌ను వైరస్‌ కట్టడికి ప్రాథమిక సాధనంగా సిఫారసు చేసింది. కొత్త వైరస్‌ అయినందున దానిపై అధ్యయన పరిశోధనలకు, కట్టడికి అవసరమైన మౌలిక వసతులు సమకూర్చుకోడానికి లాక్‌డౌన్‌ సమయాన్ని ఉపయోగించుకోవాలన్నది డబ్ల్యుహెచ్‌ఒ నిర్దేశం. కేసుల గుర్తింపు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు ట్రేసింగ్‌, విస్తృత స్థాయిలో టెస్టులు లాక్‌డౌన్‌లో చేయాలని పదేపదే నొక్కి చెప్పింది. డబ్ల్యుహెచ్‌ఒ ఎంతగా నెత్తీనోరు బాదుకున్నా అమెరికా, భారత్‌ వంటి దేశాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు లాక్‌డౌన్‌ను వాడుకున్నాయి. తొలుత మన దేశం లాక్‌డౌన్‌తో అద్భుతాలు జరిగిపోతాయని కరోనా మాయమవుతుందని, ప్రధాని మోడీ కనుకనే తెలివైన పని చేశారని లేనిపోని ఆర్భాటపు ప్రచారానికి పోయింది. సుదీర్ఘ లాక్‌డౌన్‌ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై, చివరికి ప్రభుత్వ మనుగడకే ప్రమాదం వాటిల్లేసరికి అన్‌లాక్‌ ప్రక్రియ మొదలెట్టింది. లాక్‌డౌన్‌, అన్‌లాక్‌ రెండు నిర్ణయాలూ అనాలోచితంగా, ప్రణాళిక లేకుండా చేపట్టింది. అశేష ప్రజానీకాన్ని ఇబ్బందులపాల్జేసింది.
మహమ్మారులు ప్రబలినప్పుడు అప్రమత్తమై తక్కువ సమయంలో సన్నద్ధత సాధించి నియంత్రించడానికి అడ్డుపడుతున్నది సరళీకరణ విధానాలు, లాభాలే పరమావధిగా సాగే ఫక్తు వ్యాపారం. ప్రజారోగ్యం కార్పొరేటీకరించడం వలన మహమ్మారులు వచ్చినప్పుడు జన బాహుళ్యానికి వైద్యం అందుబాటులో ఉండదని, ప్రైవేటీకరణ ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాజాలదని కరోనా తేల్చేసింది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకే సరళీకరణ విధానాలను నెత్తికెత్తుకున్న దేశాలు సుదీర్ఘ లాక్‌డౌన్‌లకో, లేదంటే లాక్‌డౌన్‌ వద్దనో చేవజారిపోయాయి. తమ విధానాలతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టాయి. ఇప్పుడు వ్యాక్సిన్‌ పైనా అదే వ్యాపార ధోరణి కనిపిస్తోంది. 80 శాతం మంది ప్రజలకు సుర క్షితమైన వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పుడే సామాజిక ఇమ్యూనిటీ సాధ్యమవుతుంది. దానికి చాలా సమయం పడుతుంది. వ్యాపార దృక్పథంతో ఆ స్థాయి వ్యాక్సినేషన్‌ అసాధ్యం. మితవాద, సరళీకరణ విధానాలను నెత్తికెత్తుకున్న ట్రంప్‌ వంటి దేశాధినేతల వలన ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలు మూల్యం చెల్లించుకుంటారో లేక ట్రంప్‌ వంటి నేతలను పక్కన పెడతారో తేల్చుకోవాలి.