ప్రజాశక్తి - నరసరావుపేట : తట్టు వ్యాధిని జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలని, ఆ దిశగా ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శాఖాధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. మీజిల్స్ రూబెల్లా ఎలిమినేషన్ డిసెంబర్ 2023 అంశంపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మీజిల్స్, రూబెల్లా కేసులు, నివారణకు వ్యాక్సినేషన్‌పై సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్షిత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం వైద్యారోగ్య శాఖ రూపొందించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ చర్మంపై దద్దుర్లు, జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను తప్పనిసరిగా సేకరించాలని, కొత్తగా క్షయ వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. గర్భస్థ లింగ నిర్ధారిత, నిషేదిత చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని, రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు లేకుండా ఆస్పత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు నడిపే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ జి.శోభారాణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి.గీతాంజలి, జిల్లా లెప్రసి ఎయిడ్స్ టిబి నివారణ అధికారి డాక్టర్ కె.పద్మావతి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ జి.చంద్రశేఖర్, డిప్యూటీ డెమో కె.సాంబశివరావు, డిపిఒ పి.రమణయ్య, మున్సిపల్ కమిషనర్‌లు పాల్గొన్నారు.










