
'ఏం కొనేట్టు లేదు..ఏం తినేట్టు లేదు' అని ధరలు ఆకాశాన్నంటి నప్పుడు సాధారణంగా జనం నోట వినబడుతుంది. కాని ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పెట్రోల్, డీజిల్, వంటనూనె, గ్యాస్, కరెంటు, నిత్యావసరాలు, కూరగాయలు, బస్సు టికెట్లు, పాల ప్యాకెట్లు ఇలా ప్రతి ఒక్కటి 30 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు రెట్లు ధర పెరిగి కూచుంది. ఈ పరిస్థితుల్లో సాధారణ జనం జీవించేది ఎట్లా ?
శ్రీలంక సాక్ష్యం
మన కళ్ల ముందే శ్రీలంక సంక్షోభం చూస్తున్నాం. ప్రజలంతా నడిబజార్లలో నిలబడ్డారు. ఆదుకునేవారు లేరు. ఆపన్నహస్తం అందించేవారు కనపడడం లేదు. నిరుద్యోగం, పేదరికం, ఆకలి కేకలు విపరీతంగా పెరిగిపోయాయి. విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా అప్పులు తేవడం, సుదీర్ఘకాలంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం ఇత్యాది కారణాలు శ్రీలంక సంక్షోభానికి కారణాలుగా తెలుసుకుంటున్నాం. అంతేకాదు. ఒకే జాతిగా మెలగాల్సిన ప్రజల మధ్య జాతివైరుధ్యాలు లేవనెత్తి తీవ్ర అశాంతిని రగిల్చినట్లు చదువుకున్నాం. ఇవన్నీ శ్రీలంక సంక్షోభ కారణాలైతే మన దేశంలో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితి అందుకు ఏమాత్రం తీసిపోదు.
మన దేశంలో...
చాప కింద నీరులా దేశవ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడమే పాలకుల పరమావధిగా కనపడుతోంది. ఉత్తరాదిలో గో సంరక్షణ, ఘర్‌వాపసీ, పౌరసత్వ సవరణ బిల్లు, సిఎఎ ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా దక్షిణాది కర్నాటకలో హిజాబ్ ఉదంతానికి తెరదీశారు. అంతటితో ఆగకుండా మైనార్టీ ముస్లింలను సమాజం నుంచి వేరు చేయాలన్న సంకల్పంతో హలాల్ పేరుతో, శబ్ద కాలుష్య నెపంతో కర్నాటక అంతా విద్వేష ప్రచారాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న శ్రీరామనవమి రోజున గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎప్పుడూ చూడని విధంగా మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికీ ఆ చిచ్చు ఆగలేదు. విజ్ఞాన మందిరాలైన యూనివర్శిటీలు, కాలేజీలు, పాఠశాలల్లో ఈ విషసంస్క ృతి విశృంఖలమవ్వడం అనర్ధదాయకం.
ఆక్స్‌ఫామ్ అంచనా ప్రకారం కోవిడ్, పెరుగుతున్న ధరలు, యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అసమానతలు సంభవించాయి. సుమారు 25 కోట్ల మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలోకి నెట్టివేయబడతారని హెచ్చరించింది. పెరుగుతున్న జీవన వ్యయాలతో కుటుంబాలు పోరాటాలు చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 'మన దేశంలో 2014 నుంచి 2022 మధ్య కాలంలో అంటే ఎనిమిదేళ్ల స్వల్ప కాలంలోనే దేశ జనాభాలో 7 కోట్ల 60 లక్షల మంది నిరుపేదలు అయ్యారు. పేదరిక అంచనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక పేదరిక వృద్ధి' అని ఆర్థికవేత్త సంతోష్ మల్హోత్రా విచారం వ్యక్తం చేశారు.
పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కులం, మతం, జాతి వైరుధ్యాలతో దేశంలో అల్లర్లు సృష్టించి అశాంతి రగిలిస్తున్నారు. ఇప్పుడు మన చుట్టూ కనపడుతున్న వాతావరణం పాలకుల కుయుక్తుల పరాకాష్టకు నిదర్శనం. వాటి ప్రతిబింబాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలో ఎన్నో సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. ఆర్థికంగా కుదేలైన కుటుంబాలు ధరల శరాఘాతంతో ఆకలితో అలమటిస్తున్నాయి. నిరుద్యోగ యువత, ఉపాధి, భద్రత కరువైన ప్రజానీకం తీవ్ర అసహనంతో కొట్టుమిట్టాడుతున్నారు. వారి దృష్టి, ఆగ్రహం దారి మళ్లించేందుకే కుల,మత ఘర్షణలతో అశాంతి, అల్లర్ల వంటివి ప్రేరేపిస్తున్నారు. ఇవన్నీ సంక్షోభ హేతువులే. ఇప్పటికైనా దేశప్రజానీకం వాస్తవాలు తెలుసుకుని మెలగాలి. మన దేశం మరో శ్రీలంకలా కాకముందే కళ్లు తెరవాలి. పాలకుల కుటిల విధానాలను తిప్పికొట్టాలి. దేశాన్ని రక్షించుకునే బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉంది.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్