''కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్దులు-కొంతమంది యువకులు ముందు యుగం దూతలు... పావన, నవజీవన బృందావన నిర్మాతలు'' అంటూ శ్రీశ్రీ వాక్యాలు నేటి పరిస్థితికి అక్షర సత్యాలుగా నిలుస్తాయి. దేశంలో తగినంత యువశక్తి ఉందని గర్వంగా చెప్పుకుంటున్న మనం, ఆ యువశక్తి ఎటువైపు పయనిస్తుందోనన్నది ఆందోళన కలిగిస్తోంది. భావితరాలకు దిక్సూచిగా ఉండాల్సిన నేటి యువత, విద్యార్ధులు కార్పొరేట్ విద్య కబంధహస్తాల్లో బందీలై, కాంపిటేటివ్ చట్రంలో నలిగిపోతూ వస్తున్న ఆటంకాలను, సమస్యలను ఎదిరించాల్సిన కనీస చలనం లేకుండా ఉందా అనిపిస్తోంది!. ఈ విధంగానే యువతను నిస్తేజంగా చేయాలన్న పాలకుల పన్నాగాలకు తగ్గట్టు సర్ధుకుపోతూ బ్రతికేయడమేనా అనేది నేటి యువత ఆలోచించాలి. మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల కోసం, అందరి బాగుకోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన ''భగత్‌సింగ్'' వారసత్వం మన ముందు యుగానిది. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవ వీరుల వీరగాధలను నేటి తరాలు తెలుసుకోవడం, ఆచరించడం చాలా అవసరం. ఒక వైపు కెరీరిజం, మరోవైపు అనైతిక జీవన విధానంతో చెడు ధోరణులు యువతరాన్ని కబళిస్తున్నాయి. నేడు మారిన, మారుతున్న నూతన సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితుల్లో వెల్లువెత్తుతున్న ఉద్యమాలకు, పోరాటాలకు విప్లవస్పూర్తి, చైతన్యం కలగాలంటే యువత భగత్‌సింగ్ లాంటి యువకిషోరాల స్పూర్తిని పునికిపుచ్చుకోవాలి. బాల్యం నుండి దేశభక్తి ప్రేరేపితుడై నాటి స్వాతంత్య్ర పోరాటంలో యువత, విద్యార్ధులను భాగస్వామ్యం చేయడంలో భగత్‌సింగ్ అగ్రభాగాన నిలిచారు. పిన్న వయస్సులోనే భగత్‌సింగ్ ఎంతో రాజకీయ పరిణతిని, సైద్ధాంతిక అవగాహనను, ఉన్నత జీవిత విలువలను సాధించారు. భావితరాలకు కొన్ని కర్తవ్యాలను ఉంచి సర్ధార్ భగత్‌సింగ్ తన 23 ఏటే దేశంకోసం తన సర్వస్వాన్ని త్యజించి ఉరికంబమెక్కాడు.
ఎందరో మహానుబావుల త్యాగాలను, ప్రజల రక్తతర్పాన్ని తన అధికారంగా పాలకులు మార్చుకున్నారు. దేశానికి వెన్నుముకైన యువశక్తిని నిర్వీర్యం చేసేందుకు, తిరోగమనం పట్టించేందుకు నాటి పాలకుల నుండి నేటి పాలకులుగా ఉన్న మనువాదుల వరకు కంకణం కట్టుకున్నారు. మనువాద సిద్ధాంతం నెత్తికెక్కించుకున్న పార్టీ దేశంలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రజలను దోచుకునేందుకు తన అధికారాన్ని ఉపయోగించి చట్టాలను చేస్తుంటే, ఆ చట్టాలు కార్పొరేట్లకు చుట్టాలుగా మారిపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదని దేశ సరిహద్దుల్లో వందరోజులకు పైగా రైతాంగం చేస్తున్న పోరాటం ''భగత్‌సింగ్'' ఇచ్చిన వారసత్వమే. 32 మంది యువకిషోరాలు ప్రాణ త్యాగాల ఫలితంగా 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'గా సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను తెగనమ్మాలనే 'మోడీ' ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గత నెలరోజులకుపైగా సాగుతున్న ఉద్యమం నాడు, నేడు భగత్‌సింగ్ లాంటి త్యాగదనులు చూపిన బాటే. ఆ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ లాంటి యువజన, విద్యార్ధి సంఘాలు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బైక్‌యాత్ర యువత, విద్యార్ధుల్లో స్పూర్తినిచ్చిందనే చెప్పాలి. స్వాతంత్య్రానంతరం భగత్‌సింగ్ వారసులుగా కుల, మతాలకు, ప్రాంతీయవాదాలకు వ్యతిరేకంగా 'మాదేహం ముక్కలైనా మా దేశం ముక్కలు కానీయం'' అని ఎంతో చైతన్యంతో నడిపిన నాటి పోరాటాల పట్ల యువత ప్రేరణ కలగడం, భాగస్వాములను కావడం నామమాత్రంగా ఉన్నది. ప్రస్తుత యువత రాజకీయ చైతన్యం కావాల్సిన ఆవశ్యకతను గుర్తించి నవసమాజ నిర్మాణం ఆశయంగా ముందుకు సాగాలి. అందుకు ''భగత్‌సింగ్'' జీవితమే నిదర్శనం. భగత్‌సింగ్ కాంక్షించిన విప్లవ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోతామా.... సర్ధుకుపోతామా... నిస్సత్తువుగా ఉండిపోతామా అనేది నేటి యువత తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇండియన్ నీరో 'మోడీ'
''రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్లు'' ప్రస్తుత మోడీ కూడా 'ఇండియన్ నీరో'లా తయారయ్యారు. దేశాన్ని కార్పొరేట్స్ కట్టబెడుతుంటే దానిని ప్రశ్నించే వారిని దేశద్రోహులని ముద్రవేసి జైళ్లలో పెడుతూ, దాడులు, హత్యలకు తెబడుతూ సంఫ్‌ుపరివార్ శక్తులు అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో ఏ సమస్యలూ లేనట్లు అయోధ్యలో రామాలయ నిర్మాణమే ద్యేయంగా ప్రజల్ని నమ్మించేందుకు ఉపక్రమించారు. తమ కళ్లముందే అనేక చర్యలు జరుగుతున్నా చూసీ చూడనట్లు ఉండడమంటే మన వేలితో మన కంటిని పొడుచుకున్నట్టేనన్నది యువత గ్రహించాలి. దీనిని ఎదిరించి ధైర్యం, తెగువతో ముందుకు సాగకపోతే భవిష్యత్తే ప్రశ్నార్ధకమౌతుందని యువత ఆలోచించాలి. రాజకీయాల్లో ప్రత్యక్ష జోక్యం పెంచుకోవాలి. మంచి రాజకీయాలలో యువత పాల్గొనడం ద్వారా రాజకీయ నిర్ణయాలు సంపద సృష్టికర్తలకు అనుకూలంగా మార్చుకోవడం సాధ్యమేనని యువత నిరూపించాలి. మంచి రాజకీయాల వైపు నడవాలి. ఇవన్నీ మాకెందుకులే ఈ పోటీ ప్రపంచంలో తామూ మునిగిపోతూ...నేను... నా కెరీర్... నా కుటుంబం అనుకుని కుచించుకుపోతే రేపు మన వంతూ వస్తుందని గుర్తించాలి. భగత్‌సింగ్ లాంటి వారిని రోల్‌మోడల్‌గా తీసుకుని పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు ధీటుగా ఎదుర్కొనేందుకు యావత్ యువత సన్నద్దం కావడమెక్కటే మార్గమని గుర్తించాలి.
రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలి
దేశంలోను, మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు మనకెందుకులే అనే ధోరణి యువతను ఆవహిస్తే అది దేశ భవిష్యత్‌కే ప్రమాదం. ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు, పరిష్కారానికి రాజకీయాలతో సంబంధముందన్న కనీస పరిజ్ఞానికి యువత, విద్యార్ధులను దూరం చేస్తున్నారు. యువత ఆలోచనా విధానాన్నే మార్చే విధంగా అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాజకీయ నిర్ణయాలు తనను, ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో కూడా గుర్తించకుండా చేస్తున్నారు. యువతకు రాజకీయాలు వద్దనే వాదనలతో పాలకులు తమ అనుకూల చట్టాలు, నిర్ణయాలు చేసుకుపోతున్నారు. పెరుగుతున్న నిరుద్యోగాన్ని ప్రశ్నించకుండా, కారణాలు గుర్తించకుండా ఉండేందుకు ప్రక్కదారి పట్టించే చర్యలకు పూనుకుంటున్నది. మౌళిక సమస్యలు పరిష్కరించకుండా, యువశక్తిని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారు. దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు, తన అనుయాయులకు దోచిపెట్టే పన్నాగాలు యువత గుర్తించకుండా ఆర్.ఎస్.ఎస్. వారసత్వ వాదులు ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు. కుల, మతాల చిచ్చులో తన పబ్బంగడుపుకుందామని మోడీ సర్కారు చూస్తున్నది.
* వి.వి.శ్రీనివాసరావు, విశాఖపట్నం. 94900 98799