ప్రజాశక్తి-మార్టూరు రూరల్: అనాథలు, నిరుపేద విద్యార్థులే లక్ష్యంగా వారి భవిషత్తుతో చెలగాటమాడుతున్న మోసగాడిపై మార్టూరు పోలీస్ స్టేషన్‌లో బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన మురళీకృష్ణ మార్టూరులోని ఆర్టీసీ బస్సుస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ బిల్డింగును అద్దెకి తీసుకొని గత సంవత్సరం శ్రీ తులసి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో ప్రారంభించారు. కరోనాతో మరణించిన వారి పిల్లలకు, నిరుపేద విద్యార్థులకు తమ ట్రస్ట్ ద్వారా ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యలను ఉచితంగా చదివిస్తానంటూ ఇంటర్ పాస్ అయిన విద్యార్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటాడు. అనంతరం వీటిని అడ్డంపెట్టుకొని కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉచిత విద్య అంటూ వారిని చేర్పించి అక్కడ కళాశాల యజమానులు ఇచ్చే కమిషన్ తీసుకుని ఉడాయిస్తాడు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన మృదుల అనే విద్యార్థినిని గుంటూరు లోని సెయింట్ మేరీస్ కళాశాలలో ఉచిత విద్య అంటూ చేర్పించగా అక్కడ కళాశాల యాజమాన్యం హాస్టల్ ఫీజుతో పాటు అన్ని ఫీజులూ తన వద్ద నుంచి వసూలు చేశారని కన్నీటి పర్యంత మయ్యింది. అదే చీమకుర్తి మండలం కెవి అగ్రహారం గ్రామానికి చెందిన అరితోటి త్రివేణి నుంచి మురళీకృష్ణ గత 8నెలల క్రితం పదో తరగతి, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని, ఫోన్ చేస్తే సమాధానం చెప్పడం లేదని త్రివేణి సోదరుడు వాపోయాడు. అలాగే ఇంజనీరింగ్ పూర్తి చేసిన మార్టూరుకు చెందిన కె ప్రశాంత్ నుంచి మురళీకృష్ణ గత సెప్టెంబర్ 8వ తేదీన రూ.30 వేలు, తిరిగి 10వ తేదీన రూ.30 వేలు గూగుల్‌పే ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకొని సమాధానం చెప్పడం లేదని ప్రశాంత్ మీడియా ముందు వాపోయాడు. అలాగే సత్తెనపల్లి పట్టణానికి చెందిన సిహెచ్ ధనుష్ రవికుమార్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి గత సంవత్సరం ఆగస్టు నెలలో మురళీకృష్ణ రూ.25 వేలు తీసుకున్నాడని, తీసుకున్న డబ్బు తిరిగి ఇమ్మని అడిగినందుకు తన సభ్యులను బెదిరిస్తున్నట్లు రవికుమార్ తెలిపాడు. ఈ మేరకు బాధితులలో కొంతమంది సోమవారం మార్టూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ కోడూరు కమలాకర్‌ను కలిసి మురళీకృష్ణపై ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్‌ఐ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయవలసిందిగా ఏఎస్‌ఐ సైదాను ఆదేశించారు. ట్రస్టును అడ్డంపెట్టుకొని మురళీకృష్ణ చేసిన అరాచకాల గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఎందరో బాధితుల వివరాలు తెలిసే అవకాశం ఉందని, అధికారులు తమకు న్యాయం చేయాలని మురళీకృష్ణ బాధితుడు ప్రశాంత్ కోరుతున్నాడు.










