Mar 03,2021 07:18

ఈ నెలలో ఇజ్రాయిల్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. గత రెండేళ్లలో నాలుగోసారి ఎన్నికలు జరగనుండడం గమనార్హం. గత కొంత కాలంగా ఆ దేశ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికాలో తెంపరి ట్రంప్‌కు పట్టిన గతే నెతన్యాహుకు పట్టనుందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు, కరోనా మహమ్మారిపై పోరులో వైఫల్యం, దేశంలో నిరుద్యోగం పెరుగుదల తదితర అంశాలకు సంబంధించి ప్రజలు 35 వారాలకు పైగా తీవ్ర స్థాయిలో నిరంతర ఆందోళనలు సాగిస్తున్నారు. అయితే ప్రభుత్వంపై గొంతెత్తుతున్న వారిపై నెతన్యాహు ప్రభుత్వం, ఆయన మద్దతుదారులు దాడులకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 20న దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులు ఆందోళనలు నిర్వహించారు. మూడు అవినీతి కేసులకు సంబంధించి నెతన్యాహు ఫిబ్రవరి 8న కోర్టుకు హాజరైన దాదాపు రెండు వారాలకే ఈ ఆందోళలు చోటు చేసుకోవడం గమనార్హం. గతనెల 20న జరిగిన ఆందోళనల్లో మూడు ప్రాంతాల్లో 'బ్లాక్‌ ఫ్లాగ్‌ ప్రొటెస్ట్‌ మూవ్‌మెంట్‌'కు చెందిన ఉద్యమకారులపై నెతన్యాహు మద్దతుదారులు దూషణలు, బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారు.
దేశానికి ఉత్తరాన ఉండే రూట్‌ 77 వద్ద జరిగిన దాడిలో గాయపడిన బ్లాక్‌ ఫ్లాగ్‌ కార్యకర్త యెర్‌ కెడన్‌ (70) అక్కడ చోటుచేసుకున్న పరిణామాలపై మీడియాకు వివరించారు. నెతన్యాహు మద్దతుదారులు ఒకరు నా ఫోన్‌ను బలవంతంగా లాక్కొని.. 'నీ కారు నంబర్‌తో పాటు నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలుసు' అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పారు. దీన్నంతా తన కెమెరాలో రికార్డు చేశానని తెలిపారు. అయితే ఇటువంటి బెదిరింపులు దౌర్జన్యాలకు తాము బెదిరేది లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా టెల్‌ అవీవ్‌, హైఫాలను కలిపే రూట్‌ 4పైన ఉండే రూపిన్‌ జంక్షన్‌ వద్ద ఒక దుండగుడు హెల్మెట్‌ పెట్టుకొని మోటార్‌ సైకిల్‌పై వచ్చి ఆందోళనకారులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, మీద పడి కొట్టేంత పని చేశాడని అన్నారు. అదేవిధంగా జెరూసలెంలో ట్రాఫిక్‌ జాంలో ఉన్న కార్ల వద్దకు వెళ్లిన బ్లాక్‌ ఫ్లాగ్‌ మూవ్‌మెంట్‌కు చెందిన ఒక మహిళా ఉద్యమకారిణిపై చెత్తను, నీటిని విసిరికొట్టారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8న కోర్టులో నెతన్యాహు ఒక ప్రకటన చేస్తూ 'ఇజ్రాయిల్‌ పౌరులారా! ఈ రోజు నా మీద జరుగుతున్న విచారణ ప్రజల అభీష్టాన్ని దెబ్బతీసేందుకు జరిగిన యత్నం మాత్రమే కాదు, నన్ను, నా మితవాద సిద్ధాంతాన్ని పడగొట్టేందుకు జరుగుతున్న కుట్ర' అని చెప్పారు. ఈనెల 23న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హింసను రెచ్చగొట్టడం అనేది నెతన్యాహు అనుసరించే జిత్తులమారి ఎత్తుగడల్లో ఇది కూడా ఒకటని, గత నెల 20న చోటుచేసుకున్న ఘటనలకు ఇదే కారణమన్న వాదన వినిపిస్తోంది.
'ఉమ్‌ అల్‌-ఫాహ్మ్‘  లో వందలాది మంది మార్చ్‌
ఇజ్రాయిల్‌ లోని అరబ్‌ సెక్టార్‌, ప్రధానంగా ఉమ్‌ అల్‌-ఫాహ్మ్ లో చోటు చేసుకున్న హింసకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మితవాద ప్రభుత్వ, పోలీసుల అసమర్ధతను నిరసిస్తూ ఉమ్‌ అల్‌-ఫాహ్మ్  పోలీసు స్టేషన్‌కు గతనెల 19న వందలాది మంది మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హదాస్‌ ఎం.కె యూసఫ్‌ జబరీన్‌ అనే ఆందోళనకారుడు మాట్లాడుతూ, ప్రధాని నెతన్యాహు పై మండిపడ్డారు. ఒట్టి హామీలను ఇవ్వడం, అబద్ధాలను చెప్పడం ప్రధాని కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు. ఇజ్రాయిల్‌ లోని అరబ్‌ కమ్యూనిటీస్‌లో చోటు చేసుకుంటున్న హింస, దౌర్జన్యాలపై పోరును సమన్వయ పరిచేందుకు, వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు పలు కమిటీలకు చెందిన ప్రతినిధులు గత వారం సమావేశమయ్యారు. అరబ్‌ సొసైటీలోని ఇళ్లను ప్రభుత్వ అధికారులు కూల్చివేస్తున్నారని, దీనిని నిరసిస్తూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సమావేశానికి అధ్యక్షత వహించిన మహ్మద్‌ బరకేV్‌ా అన్నారు. మార్చి 23 ఎన్నికల తర్వాత భారీ ఆందోళన నిర్వహించాలని, జెరూసలేం లోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు.
తీవ్ర రూపం దాల్చిన నిరుద్యోగం
దేశంలో నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చింది. గతనెల 15న సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌, ఎంప్లాయిమెంట్‌ సర్వీసు విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగ కార్మికులు 8 లక్షల మంది ఉన్నారు. జనవరి 4న గణాంకాలు విడుదల చేసిన సమయంలో 5,65,000 మందిగా ఉన్న నిరుద్యోగులు ప్రస్తుతం 40 శాతం పెరిగారు. కోవిడ్‌ నేపథ్యంలో దేశంలో గతేడాది డిసెంబర్‌ 27న విధించిన మూడో విడత లాక్‌డౌన్‌ ప్రభావం కారణంగా నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ ఆంక్షల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద ప్రస్తుతం దేశంలో నిరుద్యోగితా శాతం 19.5 శాతం ఉండగా, ఇది జనవరిలో 13.9 శాతంగా ఉంది. మొదటి, రెండో లాక్‌డౌన్‌లు మహిళలపై తీవ్ర ప్రభావాలు చూపాయి. మొదటి లాక్‌డౌన్‌ సమయంలో 11 శాతం మంది మహిళలు ఉపాధి కోల్పోగా, రెండో లాక్‌డౌన్‌ సమయంలో వీరికి అదనంగా మరో 7 శాతం మంది చేరారు.
గాజాకు వ్యాక్సిన్ల విషయంలో తలొగ్గిన ఇజ్రాయిల్‌
దిగ్బంధనంలో ఉన్న గాజా స్ట్రిప్‌కు పాలస్తీనా అధికారులు వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు ఇజ్రాయిల్‌ సర్కార్‌ ఎట్టకేలకు ఒప్పుకుంది. ఈ విషయంలో పలువైపుల నుంచి ఒత్తిడి రావడంతో నెతన్యాహు ప్రభుత్వం తలొగ్గింది. దీంతో గతనెల 17న పాలస్తీనా అధికారులు 2 వేల కరోనా వ్యాక్సిన్లను అక్కడకు పంపారు. అంతకుముందు పంపిన వ్యాక్సిన్లను అడ్డగించారని పాలస్తీనా పేర్కొంది.
                                                                                                           ( ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌ )