Feb 28,2021 11:34

'విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు..' అంటూ ప్లకార్డు పట్టుకొని నినాదాలిస్తున్నాడు ప్రభాకర్‌.
గుండెల్లో నుంచి ఎగసిపడే ఆవేశం.. ఎర్రగా కందిపోయిన ముఖంలో ప్రతిఫలిస్తోంది. పొత్తికడుపు నుంచి మెలిపెడుతోన్న బాధ.. కన్నీటి పొరలు ఎరుపెక్కిన కళ్లలోని ఎర్రజీరలను దాయలేకపోతున్నాయి.
అతని గొంతులో మూడుతరాల ఆవేదన.. ఆక్రోశం.. ఆవేశం ప్రతిధ్వనిస్తోంది.
ఆ నిరసన శిబిరంలో కూర్చున్న అందరి పరిస్థితి దాదాపు ఇలాగే వుంది. అందరి గొంతులోనూ ఒక్కటే ఆవేశం.. ఒక్కటే నినాదం.. 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' అని.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామన్న కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రకటనతో మళ్లీ కలకలం చెలరేగింది. ఆ సంస్థలో పనిచేస్తోన్న చిన్న, పెద్ద ఉద్యోగులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలోనూ ఆందోళన మొదలైంది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా, స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించాలనే లక్ష్యంగా అనేకమంది వీధుల్లోకి వచ్చారు. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసన శిబిరాలు వెలిశాయి.
స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి తమ విలువైన భూములు ఇచ్చిన నిర్వాసితులంతా 24 గంటలూ ఈ శిబిరాల్లోనే వుంటూ తమ ఆవేదనను, నిరసనను తెలుపుతున్నారు.
నిరసన తెలుపుతున్న అనేక కుటుంబాల్లో ప్రభాకర్‌ కుటుంబం కూడా ఒకటి. ప్రభాకర్‌ కుటుంబానిది మూడు తరాల ఆవేదన. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిలో ప్రభాకర్‌ కుటుంబం కూడా ఒకటి. అందుకే ఈ ఆవేశం.. ఆవేదన..
నిరసన శిబిరానికి వచ్చిన ఓ మీడియా ప్రతినిధి ప్రభాకర్‌ను కదిలించాడు. 'మీరెందుకు ఈ నిరసన శిబిరంలో పాల్గొంటున్నారు? స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరిస్తే.. మీకొచ్చిన నష్టమేంటి?' అని ప్రశ్నించాడు.


ప్రభాకర్‌ ఆవేశం.. కోపంగా మారింది. 'ఎందుకా..? ఇది మా నేల. మా తాతలు చెమటోడ్చిన మట్టి ఇది. పెద్ద పరిశ్రమలొస్తే.. ఉద్యోగాలొస్తాయని అధికారులు చెప్పిన మాటలు నమ్మి. మా పెద్దలు భూములిచ్చారు. తమ జీవితాలన్నీ మట్టిలోనే కడతేరిపోతున్నాయి. కనీసం మా పిల్లలకైనా మంచి ఉద్యోగాలొస్తాయి, వారి జీవితాలు బాగుపడతాయని భావించే ఈ భూముల్ని స్టీల్‌ప్లాంట్‌కి ఇచ్చారు. మూడు తరాలు గడిచినా.. ఉద్యోగాలూ రాలేదు, మా జీవితాలూ బాగుపడలేదు. ప్లాంట్‌ పెట్టిన తొలినాళ్లలో అర్హతలు లేవని ఉద్యోగాలు ఇవ్వలేదు. ఐటిఐ చదివిన మా నాన్న.. తనకు ఉద్యోగం వస్తుందేమోనని వయసు దాటిపోయే వరకూ ఎదురుచూస్తూనే వున్నారు. ఆయనకు ఉద్యోగ వయసు దాటిపోయింది కానీ ఉద్యోగం రాలేదు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా.. అప్పులు చేసి, నన్ను ఇంజనీరింగ్‌ చదివించాడు. నాకైనా మంచి ఉద్యోగం వస్తోందేమోననీ, మా కష్టాలన్నీ తీరిపోతాయనే ఆశతో ఎదురుచూస్తున్నాం. ఈ తరుణంలో స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామంటూ ప్రకటించడంతో మా ఆశలపై పిడుగు పడినట్లయింది. ఉద్యోగమిస్తానని వాగ్దానం చేసిన ప్రభుత్వమే ఇవ్వలేదు. ఇంక ఈ సంస్థ ప్రైవేటుపరం అయితే ఇస్తారా? ఈ శిబిరంలో అనేకమంది నాలాంటి వారే వున్నారు. అందుకే మా తాతలు కన్న కలలు నెరవేరే వరకూ ఈ పోరాటం కొనసాగిస్తాం!' అంటూ ఆవేశంగా చెప్పాడు ప్రభాకర్‌.

***

దండోరా.. వినిపిస్తోంది..
'మన గ్రామస్తులంతా బొడ్డురాయి సెంటర్‌ కాడికి రావాల్సిందిగా కోరతన్నాం. ఆడికి పెభుత్వ అధికారులొత్తన్నారు. భూముల గురించి మాట్టాడతారంటహో!' అని డప్పు కొడుతూ ఒకతను అరుచుకుంటూ వీధులన్నీ తిరుగుతున్నాడు.
ఆ దండోరా విని.. లోపల్నించి వచ్చిన అప్పల్నాయుడు ఆలోచనలో పడ్డాడు. అప్పటికే ఆ నోటా ఈ నోటా విన్నాడు. ఇక్కడేదో పెద్ద పరిశ్రమ వస్తందని, వేల ఎకరాల భూమి కావాల్సి వస్తుందని, భూములతో పాటు కొన్ని గ్రామాలూ ఖాళీ చేయాల్సి వస్తుందనీ.. రకరకాల పుకార్లు వినిపించాయి.
'అయితే అవి పుకార్లు కాదు, నిజమేనన్న మాట. ఏమైతదో చూద్దాం!' అనుకొని, తుండుగుడ్డ
భుజానేసుకొని, రోడ్డు మీదకొచ్చాడు.
అప్పల్నాయుడికి పది ఎకరాల వ్యవసాయ భూమి వుంది. పెద్ద పెంకుటిల్లు, ఎడ్లబండి వుంది. ఎంతోకొంత జరుగుబడి వున్న కుటుంబమే. అయినా కుటుంబం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి
బతకాల్సిందే.


ఏం జరుగుతుందోననే ఆందోళనతోనే బొడ్డురాయి సెంటర్‌కి చేరుకున్నాడు. అప్పటికే గ్రామంలోని చాలామంది అక్కడ గుమికూడారు.
గ్రామసభ ప్రారంభమైంది. ఒక అధికారి మాట్లాడుతూ.. 'ప్రజలారా! ఇక్కడ దేశంలోనే పెద్ద స్టీల్‌ ప్లాంట్‌ పెట్టడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 26 వేల ఎకరాల భూమి అవసరమౌతుంది. మీ గ్రామ పంచాయతీ చుట్టుపక్కల 64 గ్రామాల్లో ఈ పరిశ్రమకు అవసరమైన భూమిని సేకరిస్తాం. మీరందరూ సహకరించాలి. మీ భూములకు ప్రభుత్వ ధర ప్రకారం డబ్బులిస్తాం. అలాగే మీ కుటుంబాల్లో చదువుకున్న యువకులందరికీ ఉద్యోగాలిస్తాం. ఇళ్లు కోల్పోయిన వారికి వేరే ప్రాంతంలో స్థలం ఇస్తాం!' అంటూ ప్రకటించాడు. తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడారు. 'ఈ ప్రాంతమంతా గొప్పగా అభివృద్ధి అవుతుంది' అని హామీలిచ్చారు.
రోజులు గడుస్తున్నాయి.. అప్పల్నాయుడు తన పది ఎకరాల భూమికీ నష్టపరిహారంగా ఇచ్చిన
డబ్బుతో కూతురికి పెళ్లి చేశాడు. కొడుకు సూరినాయుడిని పదో తరగతిలో చేర్పించాడు. వ్యవసాయం
లేకపోవడంతో వున్న ఎడ్లబండిని అమ్మేశాడు. పని కోసం స్టీల్‌ప్లాంట్‌ చుట్టూ తిరుగుతున్నాడు.
కొందరికి చిన్నచిన్న ఉద్యోగాలు వచ్చినా, చదువు లేకపోవడంతో అప్పల్నాయుడికి ఉద్యోగం రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రోజువారి కూలీగా చేరాడు.


ఇదిగో అదిగో అంటూ ఏడాది గడిచిపోయింది. ఉన్న డబ్బులు కాసినీ కుటుంబ ఖర్చులకు కరిగిపోయాయి. సూరినాయుడు పదోతరగతి పాసయ్యాడు. కూతుర్ని పురుడు కోసం తీసుకొచ్చారు. కూతురికి పురుడుపోసి, అత్తవారింటికి పంపాలి. కొడుకుని పై చదువుకు పంపాలి. చేతిలో డబ్బు లేదు. అప్పు చేసి, కూతురికి పురుడు పోశాడు. ఘనంగా కూతుర్ని, మనవడ్ని అత్తవారింటికి పంపాడు.
ఐటిఐ చదివితే స్టీల్‌ప్లాంట్‌లో మంచి ఉద్యోగం వస్తదని వాళ్లు వీళ్లు చెప్పగా.. కొడుకును ఐటిఐలో చేర్పించాడు.
పది ఎకరాల రైతుగా గౌరవంగా బతికిన అప్పల్నాయుడు చివరకు కూలీగా మారాల్సి వచ్చింది. 'అయినా ''విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు..''. నాకు రాకపోయినా నా కొడుక్కి అయినా ఉద్యోగం వస్తది. ఇది నా హక్కు.. ఇది మా హక్కు..!' అనుకుంటూ రోజులు లెక్కపెడుతున్నాడు.
 

***
సూరినాయుడు ఐటిఐ పాస్‌ అయ్యీ ఏడాది దాటిపోయింది.

కొడుకు ఉద్యోగం కోసం అధికారుల దగ్గరకు, ప్రజాప్రతినిధుల దగ్గరకు చెప్పులరిగేలా తిరుగుతున్నాడు అప్పల్నాయుడు.
పెద్దపెద్ద చదువులు చదివినవారు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ విస్తరిస్తూనే వుంది. లాభాలు గడిస్తూనే వుంది. అధికారులు మారిపోతూనే వున్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలు మాత్రం అలాగే వున్నాయి.
ఉద్యోగాలిస్తామని, ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పిన అధికారులు, రాజకీయ నాయకులు ఇప్పుడు కనబడటం లేదు.
చివరకు కాంట్రాక్ట్‌ ఎంప్లాయిగా సూరినాయుడికి ఉద్యోగం దొరికింది. తర్వాత పర్మినెంట్‌ అవుతుందని చెప్పారు. అదే మహాప్రసాదం అనుకున్నారు.


తన కొడుకు స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రేపోమాపో పర్మినెంట్‌ అవుతుంది. ఆడైనా మంచిగా స్థిరపడతాడని కలలు కంటూనే కన్నుమూశాడు అప్పల్నాయుడు.
ఇప్పుడు తండ్రి చేసిన పోరాటం కొడుకు మొదలుపెట్టాడు. తన ఉద్యోగం పర్మినెంట్‌ చేయించుకోడానికి. అందరు అధికారులనూ కలుస్తున్నాడు. ఇక్కడ ఉద్యోగం తమ హక్కు అని, అధికారులు తమ హక్కును పట్టించుకోవడం లేదని కార్మికసంఘాల ద్వారా పోరాటం చేస్తున్నాడు.
రోజులు గడుస్తూనే వున్నాయి. తమకు న్యాయం చేయాలని మారిన ప్రతీ ప్రభుత్వ పెద్దల వద్దకూ వెళ్ళి, తమ గోడు వెళ్ళబోసుకున్నా ప్రయోజనం లేకపోయింది.


దశాబ్దాల తరబడి ఎదురుచూసినా భవిష్యత్‌కు భరోసా లేకుండాపోయింది. భూములిచ్చి ఉద్యోగం కోసం ఎదురుచూసీ చూసీ వయస్సు అయిపోయింది. చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగం నుండి కూడా సూరినాయుడు రిటైర్‌ అయిపోయాడు.
ఇప్పుడు తనకు కాకపోయిన తన కొడుకుకైనా ఉద్యోగం రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాడు.
ఇటువంటి సమయంలో ''స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ'' అంటూ.. పిడుగులాంటి వార్త వినిపించడంతో సూరినాయుడు కుదేలైపోయాడు.
'ఆ పది ఎకరాల భూమి వుంటే ఇప్పుడు పరిస్థితి మరోలా వుండేది. భూమి లేదు, ఉద్యోగం లేదు. తన కొడుకుకైనా వస్తుందో రాదో తెలీదు.' అని మదనపడుతూ మంచం పట్టాడు సూరినాయుడు.


ఇప్పుడు తండ్రి పోరాటాన్ని తన భుజానికెత్తుకున్నాడు ప్రభాకర్‌. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరిస్తామన్న ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఆవేశంతో రగిలిపోతున్నాడు. పగలూ రేయీ నిరసన శిబిరంలోనే వుంటూ తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నాడు.
అదే ఇప్పుడు మీడియాతో చెప్పాడు.


'స్టీల్‌ప్లాంట్‌ నిర్మిస్తే మా బతుకులు బాగుపడతాయనే.. మా జీవనాధారమైన భూములను ఇచ్చాం. కర్మాగారం వస్తే మాకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అప్పట్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో సభలు పెట్టి చెప్పడంతో.. నిజమని నమ్మి, భూములను అప్పగించారు మా పెద్దలు. మా తరం వచ్చినా ప్లాంట్‌ కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం జరగలేదు. భూ సేకరణ సమయంలో ఇచ్చిన హామీల్లో చాలావరకూ నెరవేరనే లేదు. భవిష్యత్తులో అయినా నెరవేరతాయేమో అన్న ఆశతో ఇప్పటివరకూ ఎదురుచూస్తున్నాం. ఈలోగానే స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మా తాత బతికున్నంత వరకూ ఎదురుచూస్తూనే వున్నాడు నాన్నకు ఉద్యోగం వస్తుందని, తమ జీవితాలు బాగుపడతాయని. ఇప్పుడు మా నాన్న ఎదురుచూస్తున్నాడు.. నాకు ఉద్యోగం వస్తుందని, మా బతుకులు బాగుపడతాయని. మా ఒక్క కుటుంబమే కాదు, ఈ చుట్టుపక్కల వున్న గ్రామాల్లోని చాలామంది పరిస్థితి ఇలాగే వుంది' అని ఆవేశంగా చెప్పాడు ప్రభాకర్‌.
'స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోడానికి మా ప్రాణాలను సైతం ఫణంగా పెడతాం' అని పక్కనే మరో యువకుడు గట్టిగా చెప్పాడు. ఒక్కసారిగా నిరసన శిబిరం నినాదాలతో హోరెత్తింది.


'కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటం మాకు స్ఫూర్తి. అదే స్ఫూర్తితో మా పోరాటం కొనసాగిస్తాం. మా భూముల్లో కట్టిన ఈ సంస్థను కాపాడుకుంటాం. మాకు రావాల్సిన ఉద్యోగాలను సాధించుకుంటాం. మా హక్కులు సాధించుకునే వరకూ ఎన్ని తరాలు మారినా మా స్వరం మాత్రం మారదు. ''విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు..'' అని నినదిస్తూనే వుంటాం' అని నిరసన శిబిరం హోరెత్తింది.
                                                              * కంచర్ల రాజాబాబు, 94900 99231