Apr 29,2023 23:40

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న వ్యవసాయాధికారులు

ప్రజాశక్తి -ఆనందపురం: ఆనందపురం మండలం తర్లువాడ ఎస్‌సి కాలనీలో శనివారం చిరుధాన్యాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి మాట్లాడుతూ, ప్రస్తుత 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో వాటి సాగును ప్రోత్సహించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. చిరు ధాన్యాలు తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో పండించవచ్చన్నారు. ఈ పంటలను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసి అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు ఆహారంగా అందించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్యానికి చిరు ధాన్యాల ఆహరం చాలా మంచిదని తెలిపారు. ఈ సదస్సు లో వివిధ రకాల చిరు ధాన్యాల ప్రదర్శించటం జరిగింది. చిరు ధాన్యాల విత్తనాలను చిరు సంచుల రూపంలో పంపిణీ చేశారు. చిరు ధాన్యాల మిల్లింగ్‌ కోసం అధునాతన పరికరాలను అందుబాటులో తేవడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. బిందు సేధ్యంపై ఎపిఎంఐపి అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రహీం అవగాహనా కల్పించారు. ప్రకృతి వ్యవసాయం ఏపీ సిఎన్‌ఎఫ్‌ డీపీడీ మోహనరావు మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం, కూరగాయలు సాగు ద్వారా అధిక ధరలను పొందవచ్చని తెలిపారు. ఈ సందర్బంగా ప్రకృతి వ్యవసాయంపై ప్రచురించిన కరపత్రాలను, పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి, ఉద్యానశాఖాధికారి మన్మధరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.