Nov 01,2023 23:40

తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు


ప్రజాశక్తి-తర్లుపాడు
తర్లుపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సిపిఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దగ్గుపాటి సోమయ్య తెలిపారు. ఈ సందర్బంగా దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ వర్షాభావం వల్ల తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని, వేసిన అన్ని పంటలు ఎండిపోయి లక్షలాది రూపాయలు రైతుల పెట్టుబడులు భూమిలో కలిసిపోయాయని వెంటనే తర్లుపాడు మండలాన్ని, మార్కాపురం రెవిన్యూ డివిజన్‌ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ బుధవారం తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఎండిన పంటలను వెంటనే నమోదు చేయాలని, మిర్చికి ఎకరానికి లక్ష రూపాయలు, పత్తి, పొగాకు పంటకు 50 వేల రూపాయలు కంది, మినుము, ఆముదాలు తదితర పంటలకు ఎకరానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని యుద్ధ ప్రాతిపదిక పైన అన్ని గ్రామాలలో త్రాగునీటి సరఫరా చేయాలని, పశువులకు నీటి తొట్టెలను ఏర్పాటు చేసి పశువుల దాహార్తి తీర్చాలని, ఉచితంగా గడ్డి సరఫరా చేయాలని వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కనీసం 10 టీఎంసీలు నీటిని వెంటనే విడుదల చేయాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తర్లపాడు మండల రైతు సంఘం కార్యదర్శి ఏరువా పాపిరెడ్డి, రైతులు జి. వీరనారాయణ, బి.శ్రీనివాస్‌రెడ్డి, కే. దారపు రెడ్డి, దొడ్డ సుబ్బారెడ్డి, సిహెచ్‌ వెంకటేశ్వర్లు సానికమ్మ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.