ప్రజాశక్తి-తాడేపల్లి : తాడేపల్లి పట్టణంలోని అమరారెడ్డి నగర్, యానాదుల కాలనీ తదితర ప్రాంతాల్లో ఇప్పుడు నివాసముంటున్న ఇళ్లకే పట్టాలివ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి స్థానిక సిపిఎం బృందం ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న పేదలకు ఇక్కడే పట్టాలివ్వాలని కోరారు. ఇరిగేషన్ స్థలాలకు పట్టాలివ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పే మాటలు సరైనది కాదన్నారు. అలా అనుకుంటే ప్రభుత్వం వాళ్లను అక్కడే నివాస ఉండేలా నివాస హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రజలు నివశిస్తున్న ప్రాంతంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు పాలనలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు కల్పించారని చెప్పారు. విజయవాడ నగరంతో పాటు పెద్దఎత్తున బైపాస్ రోడ్డు వైపు అపారుమెంట్లు వచ్చి పేదలకు జీవనోపాధి దొరుకుతుందని చెప్పారు. ఇక్కడ నుంచి పనులకు వెళ్లడం వారికి సులభంగా ఉంటుందన్నారు. పేదల జీవన చక్రం సజావుగా సాగాలంటే ఇప్పుడుంటున్న స్థలాలకే పట్టాలివ్వాలని కోరారు. ఆ మేరకు ఈ నెల 5వ తేదీ బుధవారం కృష్ణుని గుడి వద్ద సచివాలయం ముందు జరిగే ధర్నాకు బాధితులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
సిపిఎం పట్టణ కమిటీ తీర్మానం
ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న పేదలందరికీ వారు నివశిస్తున్న చోటే స్థలాలకు పట్టాలివ్వాలని సిపిఎం పట్టణ కమిటీ తీర్మానించింది. గాదె సుబ్బారెడ్డి అధ్యక్షతన ఆదివారం తాడేపల్లి మేకా అమరారెడ్డి భవన్‌లో పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రతిఒక్కరికీ రెండు సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు సెంట్ల స్థలంలో పేదల తమ జీవనం గడిచే విధంగా కోళ్లు, గేదెల పెంపకం వంటి చేసుకుంటారని సూచించారు. సెంటు స్థలంలో నలుగురు సభ్యులున్న కుటుంబం ఎలా జీవిస్తుందని ప్రశ్నించారు. తాడేపల్లిలో అనేక పేటల్లో సిపిఎం బృందాలు జరిపిన సర్వేలో తాము ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పట్టాలివ్వాలనే డిమాండ్ వినిపిస్తోందన్నారు. రైల్వే స్థలాల్లో నివాసముంటున్న వారికి కూడా రెండు సెంట్ల స్థలం కేటాయించాలని కోరారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రజలు కట్టలేక ఆందోళన చెందుతున్నారని, వాటిని తగ్గించాలని కోరారు. కార్యక్రమాల్లో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, కె.కరుణాకరరావు, వి.దుర్గారాలు, డివి భాస్కరరెడ్డి, ఎస్.ముత్యాలరావు, సుబ్బా రావు, ఎల్.ఆచారి, డి.యోహాన్, పి.గిరిజ, ఎం.శ్రీనివాసరెడ్డి, బర్నబాసు పాల్గొన్నారు.
పిల్లల చదువు దెబ్బతింటుంది
బి.రమేష్, ఎం.నాగమల్లేశ్వరి
అమరారెడ్డి నగర్ నుంచి ఇద్దరు పిల్లలను స్థానికరగా ఉన్న పాఠశాలలో చేర్చాం. రాజధానిలో ఎక్కడో మారుమూల ప్లాటు ఇచ్చా రు. మేము నివశిస్తున్న ఇళ్లకే పట్టాలివ్వాలి. ఊర్లకు దూరంగా ఎక్కడో అడవిలో పడేసి పట్టాలిచ్చారు. అక్కడ ఉండలేని పరిస్థితి.
కోర్టులో ఓడిపోతే నష్టపోవాలి
వి.సుబ్బారావు, కె.పార్వతి
మాకిచ్చిన పట్టాలో కోర్టు తీర్పుకు అనుగుణంగా మూడో పార్టీకి అధికారాలు ఉంటాయని చెప్పారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే మేం నష్టాపోవాల్సిందేనా? పిడబ్య్లూడి ఇరిగేషన్ స్థలంలో పట్టాలివ్వకూడదని అధికారులు చెబుతున్నారు. పట్టాలివ్వకపోతే హక్కు పత్రాలైనా ఇప్పించాలి.










