ప్రజాశక్తి-పాడేరు: తమిళనాడు ఏజెన్సీలోని నమ్మకల్ ప్రాంతంలో ఈ నెల 19, 20, 21, తేదీల్లో జరుగుతున్న ఆదివాసి గిరిజన సంఘం నాల్గవ జాతీయ మహాసభల కు ఆంధ్ర రాష్ట్రం నుంచి జిల్లాలకు చెందిన 34 మంది ఆదివాసీ ప్రతినిధులు ఆదివారం తరలి వెళ్లారు. ఈ మహాసభలకు ఆంధ్ర తరపున హాజరవుతున్న ఆదివాసి గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పల నరస ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివాసీ హక్కులు, చట్టాలు పరిరక్షణే ధ్యేయంగా ఈ నాల్గవ జాతీయ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖలో మూడవ జాతీయ మహాసభ జరిగిన, నాటి నుండి నేటి వరకు ఆదివాసీ హక్కులు, చట్టాల పై కేంద్ర ప్రభుత్వ దాడులు వాటిని ప్రతిఘటిస్తూ నిర్వహించిన ఉద్యమం, పోరాటం పై సమీక్షించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ను ఈ నాల్గవ మహాసభల్లో రూపొందించుకోవడం జరుగుతుందన్నారు.ఆంధ్రా ప్రాంతంలో స్థానిక ఆదివాసీ యువతకు ఉపాధి, ఉద్యోగం నియామక ప్రమోషన్ లో వంద శాతం రిజర్వేషన్ ను సుప్రీం కోర్టులో రద్దు చేయడం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, 5 వ షెడ్యూల్డ్ ఏరియా లో నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీ గ్రామాలను చేర్చడం, బోయ వాల్మీకి ను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వ్యతిరేఖంగా తీర్మానం చేసి రాష్ట పతికి సిఫార్సు చేయడం, హైడ్రో పవర్ ప్రాజెక్టు, మైనింగ్ కంపెనీ లకు లీజుకు ఇవ్వడం మొదలగు సమస్యలపై జాతీయ మహాసభలో చర్చిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోత రాం బాబు, ప్రధాన కార్యదర్శి సురేంద్ర, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాగిని దర్మన్న పడల్, పొద్దు బాల్ దేవ్ తదితరుల పాల్గొన్నారు.










