బతుకు
లెక్కలు అర్థంకాక
బూజు బతుకులు
వెక్కిరిస్తుంటే
ఇప్పుడు
కొత్తగా
మనిషి ఎక్కాలు
తిక, మక పెడుతున్నాయి
బంధాలు
తీసివేతలు అయిపోతూ
సున్నాగా మారి
శూన్య పద్దులుగా కనిపిస్తున్నాయి
కలిసే అడుగుల లెక్కల్ని
లెక్కిస్తూ వెళ్తుంటే
శూన్య దారులు అగుపిస్తున్నాయి
అర్థమైనవి కొన్నైతే
అర్థం కానివి కదిలే మేఘాల్లా
కనిపించి వినిపిస్తున్నాయి
పాత మనిషే
కొత్త ముఖంతో, మాసిన మనసుతో
చీకటి పొద్దుల్ని అన్వేషిస్తూ
సరికొత్త కలల్ని నాటుతున్నాడు
ఇప్పుడు ఎవరికి, ఎవరూ అర్థం కాక
కాలం గదిపై కుట్ర రచనలతో
కక్ష గూడుపై నిల్చొన్నాడు
మళ్లీ ఇప్పుడు కొత్తగా మనిషిని ఆవిష్కరించాలి
చెడిపోయిన మేధస్సు చిప్పు మోరాయిస్తే
తర్జుమా చేసుకొని
కపట నాటకాలకు తెర దించాలి..!
మహబూబ్ బాషా చిల్లెం
95020 00415