Aug 16,2022 00:27

గౌర‌వ వంద‌నం స్వీక‌రిస్తున్న రాజ‌న్న‌దొర

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం)
విశాఖ జిల్లాలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు బ్యారెక్స్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్లాలన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు. వారి త్యాగాలు అజరామరమన్నారు. రాష్ట్రాభివృద్ధికి సిఎం జగన్‌ అహర్నిశలూ కృషి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్‌ సిహెచ్‌.శ్రీకాంత్‌, ఎంపీ ఎంవివి.సత్యనారాయణ, శాసన సభ్యులు వాసుపల్లి గణేష్‌ కుమార్‌, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లక్షీశ, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, పోలీసాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అదికారులు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు
జిల్లాలో అమలు జరుగుతున్న పలు సంక్షేమ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. మొత్తం 10 ప్రభుత్వ శాఖల శకటాలు పాల్గొన్నాయి. శకటాలలో జివిఎంసి మొదటి స్థానంలోనూ, డిఆర్‌డిఎ శకటం రెండో స్థానంలోనూ, విఎంఆర్‌డిఎకు చెందిన శకటం తృతీయ స్థానంలోనూ నిలిచాయి.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గవర్నమెంట్‌ క్వీన్‌ మేరీ పాఠశాల విద్యార్థులు 'వందేమాతరం బ్యాలె' నృత్య ప్రదర్శన, పెందుర్తి గవర్నమెంటు హైస్కూలు విద్యార్థులు దేశభక్తి గీతాలకు సంబంధించిన నృత్య ప్రదర్శనలు, మేఘాద్రి గెడ్డ ఎపి సోషల్‌ వెల్పేర్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన 'హమ్‌ ఇండియా వాలె', భీమిలి కెజిబివి స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన 'సారే జహాసే అచ్చా, 'హర్‌ ఘర్‌ తిరంగ' నృత్య రూపకాలు అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఆదర్శం..
జివిఎంసి మేయర్‌, కమిషనర్‌
స్వాతంత్య్ర దినోత్సవం రోజు మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి తన లక్ష్యం మరిచిపోలేదు. కాలుష్య నియంత్రణలో భాగంగా తన వాహనం వదిలి ప్రజా రవాణా వ్యవస్థనే ఎంచుకున్నారు. తన క్యాంపు కార్యాలయం నుంచి జివిఎంసి కార్యాలయం వరకూ బస్సులోనే వచ్చారు. ఆ తరువాత జెండా వందనం కార్యక్రమంలో కమిషనర్‌ లక్ష్మీశతో కలిసి పాల్గొన్నారు. జివిఎంసి ప్రధాన కార్యాలయంలో లక్ష్మీశ జెండా ఎగురవేశారు. సోమవారం ఆయన బ్యాటరీ కారును ఆశ్రయించి కార్యక్రమానికి హాజరయ్యారు.
సర్వతోముఖాభివృద్ధికి సహకరించండి
ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి : జల్లా సమ్రగ, సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. స్థానిక పరిశ్రమలతో అనుసంధానం చేసేందుకు అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోమవారం అనకాపల్లిలోని ఎన్‌టిఆర్‌ స్టేడియంలో జరిగిన 76వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జాతీయపతాకం ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తన సందేశంలో జిల్లా ప్రగతిని వివరించారు. 'జిల్లాలో రూ.48 వేల కోట్ల పెట్టుబడులతో 37 ప్రధాన పరిశ్రమలు రానున్నాయి. ఇవి పూర్తయితే 69 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రూ.38.57 కోట్ల పెట్టుబడులతో 114 ఎంఎస్‌ఎంఇలు రానున్నాయి. వీటి ద్వారా 2,522 మంది ఉపాధి కల్పించబడుతుంది. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద జిల్లాలో ఈ ఏడాది తొలి విడతలో రూ.183.26 కోట్లు 2.44 లక్షల మందికి రైతుల ఖాతాలో జమచేశాం. ఆయిల్‌పామ్‌ సాగు ప్రోత్సహించేందుకు హెక్టార్‌కు 12 వేల నుంచి 29 వేల వరకు మొక్కల రాయితీ పెంచాం. అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద రూ.392.53 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌, నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద రూ.24.77 కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. జిల్లాలో 1278 గ్రామ సంఘాలు, 39,671 స్వయం సహాయక సంఘాలలో 4.34 లక్షల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. రూ.500 కోట్లతో నర్సీపట్నంలో చేపట్టే మెడికల్‌ కాలేజీ పనులు ప్రారంభదశలో వున్నాయి. రూ.347 కోట్లతో విశాఖపట్నం - చెన్నరు ఇండిస్టియల్‌ కారిడార్‌ పనులు చేపడుతున్నాం. భూ సేకరణ పనులు పురోగతిలో వున్నాయి. రూ.32.30 కోట్లతో చేపట్టబోయే 49 పంచాయతీరాజ్‌ రోడ్డు పనులు టెండర్ల దశలో వున్నాయి. బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద రెండు దశల పనులకు రూ.17వేల కోట్లతో పరిపాలనా అనుమతులు లభించాయి. ఈ రెండు దశల పనులు పూర్తయితే జిల్లాలో 1.77 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం కలుగుతుంది. వీటి సర్వే పనులు పురోగతిలో వున్నాయి. వైఎస్‌ఆర్‌ లే అవుట్లలో గృహ నిర్మాణాలు పూర్తయిన తరువాత శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.46.89 కోట్లతో ప్రతిపాదనలు తయారయ్యాయి. కొండకర్ల ఆవను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.' అని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి, ఎస్‌పి గౌతమి శాలి, అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, డిఆర్‌ఒ వెంకటరమణ, ఆర్‌డిఒ చిన్నికృష్ణ, జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.