ప్రజాశక్తి-ఉక్కునగరం : త్రిపురలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ గూండాల దాడిలో గాయపడిన వారికి సంఘీభావ నిధిని స్టీల్ సిఐటియు ఆధ్వర్యాన ప్లాంట్‌లో సేకరించారు. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ, ఈ నెల 2న రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు భౌతిక దాడులకు పాల్పడటాన్ని ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంతో ప్రతిపక్షాలపై దాడులకు దిగుతోందని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు భౌతిక దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారపోస్తుండటంతో ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలిపారు. ఇది అన్యాయమని ప్రజాస్వామ్యవాదులు గళం విప్పితే ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు భౌతిక దాడులకు దిగి ధన, మాన ప్రాణాలను హరించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్, ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, గంగాధర్, నీలకంఠం, డి.కృష్ణమూర్తి, కె.సత్యనారాయణ, బిఎన్.మధుసూదన్, ఆర్.దుర్గాప్రసాద్, డి.శ్రీనివాస్, కర్రి వీరాస్వామి, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.










