Apr 19,2023 23:56

మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేస్తున్న బేబీ రాణి

ప్రజాశక్తి - సామర్లకోట
త్రిప్ట్‌ సొసైటీలో చేరిన వారికి ఎంతో మేలు చేకూరుతుందని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీ రాణి అన్నారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలోని సామర్లకోటలో ఇటీవల మతి చెందిన అంగన్‌వాడీ హెల్పర్‌ యేలేటి గంగాభవాని కుమార్తెకు యేలేటి లక్ష్మికి త్రిప్ట్‌ సొసైటీ ద్వారా వచ్చిన రూ.30 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బేబీ రాణి మాట్లాడుతూ పేద పిల్లలకు పౌష్టికాహారం అందించడంతోపాటు అనేక ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా పనిచేస్తున్న అంగన్‌వాడీలను ప్రభుత్వం రిటైర్‌ అయిన తరువాత కనీసం పట్టించుకోకుండా నామమాత్రంగా టీచర్‌కు రూ.50 వేలు హెల్పర్‌కు రూ.20 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అంగన్‌వాడీ సంఘం ఆధ్వర్యంలో 6 సంవత్సరాల నుండి సొసైటీ నడుస్తోందని అన్నారు. దీని ద్వారా అనేకమంది అంగన్‌వాడీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మేలు జరిగిందని తెలిపారు. ఇటీవల సామర్లకోటలో మృతి చెందిన ఏలేటి గంగాభవాని ఇప్పటి వరకు రూ.2 వేలు చెల్లించారని, ఆమె అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుమార్తెకు రూ.30 వేలు వచ్చాయన్నారు. మిగిలిన అంగన్‌వాడీ వర్కలందరూ కూడా సొసైటీలో సభ్యులుగా నమోదు చేయించుకోవాలని ఆమె కోరారు. చనిపోయిన అంగన్‌వాడీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చనిపోయిన వారి కుటుంబ సభ్యులకే అంగన్‌వాడీ పోస్టులను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో త్రిప్ట్‌ సొసైటీ చైర్మన్‌ చంద్రావతి, డైరెక్టర్‌ చామంతి, సామర్లకోట అర్బన్‌ అధ్యక్ష కార్యదర్శులు అమలావతి, నాగమణి, సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్‌, సెక్టర్‌ లీడర్లు, అంగన్‌వాలు పాల్గొన్నారు.