ప్రజాశక్తి-ములగాడ : సిపిఎం దేశరక్షణ భేరి ప్రచారోద్యమంలో భాగంగా ఆదివారం జివిఎంసి 62వ వార్డు పరిధి త్రినాధపురంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వరంగ ప్రరిశ్రమలైన ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్, విశాఖ స్టీల్‌ప్లాంట్ తదితరాలను అమ్మే హక్కు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి లేదన్నారు. మోడీ విధానాలు దేశానికి ఎంతో నష్టమన్నారు. ప్రజల ఆస్తిని కార్పోరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. మోడీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా దేశరక్షణ భేరి కార్యక్రమాన్ని సిపిఎం చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న సరస్వతీ పార్కు నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు వేలాది మందితో మహాప్రదర్శన, అనంతరం బహిరంగసభ ఉంటాయని చెప్పారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం పొలిట్‌భ్యూరో సభ్యులు బివి.రాఘవులు హాజరవుతారని, వేలాదిగా ప్రజలు పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 62వ వార్డు కార్యదర్శి టి.అప్పారావు, మల్కాపురం జోన్ నాయకులు పిసిని.రామారావు, ఏరియా నాయకులు బి.జగ్గునాయుడు, వి.రాము, కృష్ణ, ఎంఆర్‌కె.జనార్థన్, పి.పుణ్యవతి, ఎస్.మోహనాంగి, జయశ్రీ, పుష్ప తదితర్లు పాల్గొన్నారు.










