తెనాలి:పట్టణానికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు సారథ్యంలో టిడిపి వ్యవస్థాప కులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామా రావు 3డి విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. స్థానిక వహాబ్ రోడ్ లోని సూర్య శిల్ప శాలలో సిద్ధమైన ఎన్టీఆర్ విగ్రహాలను గురువారం శిల్పులు కాటూరి వెంకటేశ్వర రావు, కాటూరి రవి చంద్ర, కాటూరి శ్రీహర్ష ప్రదర్శిం చారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ముగింపు వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు వీటిని బహుకరించాలని ఆ పార్టీ శ్రేణులు కోరిన మీదట ఎన్టీఆర్ విగ్రహాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ప్రముఖంగా రాష్ట్రంలోని నరసరావుపేట, తెలంగాణ లోని బాన్సువాడ ప్రాంతం నుంచి ఈ విగ్రహాల తయారీకి ఆర్డర్లు ఉన్నట్టు చెప్పారు. ఇతర దేశాలకు కూడా ఈ విగ్రహాలు పంప నున్నట్లు వెల్లడించారు. రెండున్నర అంగుళాల నుంచి మూడు అడుగుల ఎత్తు కలిగిన విగ్రహాలను తయారు చేస్తున్నట్లు వివరించారు. ప్రదర్శనను టిడిపి నాయకులు వీరవల్లి మురళి, కనగాల నాగభూషణం తిలకించారు.










