సమయానికి ముందస్తుగానే ఎన్నికల వాతావరణం వచ్చేయడంతో, ఎన్నికల ప్రచారంలో పార్టీలు మునిగి తేలుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2019 నాటి ప్రజాదరణ నేడు కనిపించడం లేదన్నది వాస్తవం. నాటి ఆదరణ తరుగుతూ వస్తోంది. వైనాట్ 175 అన్న నినాదం రాజకీయ ప్రచారం గానే మిగిలిపోనుందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. జిల్లా వైసిపి ముఖ్య నేతలూ ఈ వాస్తవాలను అంగీకరిస్తున్నారు. వంద సీట్లతోనైనా మళ్లీ అధికారం తమదేనని విశ్వసిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రజల ఎండకు సంక్షేమ పథకాల గొడుగు కాస్తుంది గానీ వర్షాలు, తుపాను వంటి పాలనా వైఫల్యాలకు సంక్షేమ పథకాల గొడుగు కాసే పరిస్థితి ఉండదని ఆ పార్టీ కీలక నేతలే తమ అనుయాయుల వద్ద చెప్తున్నారని తెలిసింది. ప్రజలపై ఒక్క జిల్లాలోనే నెలకు అదనంగా రూ.ఐదు కోట్ల భారం పడుతోంది. దీనికితోడు తాజాగా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఈ వాస్తవాన్ని అంగీకరించలేక మింగలేక, కక్కలేక సతమతమవుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఏ వస్తువైనా, డబ్బులైనా అనుమతి లేకుండా తీసుకుంటే అది దొంగతనమే అవుతుంది. జగన్ ప్రభుత్వం అలాంటి దొంగతనానికి పాల్పడుతోంది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘ నిధులను దొంగలించింది. అందులో జిల్లాకు రావాల్సినవి రూ.78 కోట్లు ఉన్నాయి. సర్పంచ్‌లు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో, విద్యుత్ బిల్లుల పేరుతో ఆ నిధులను మినహాయించుకుంది తప్ప మిగిలిన సొమ్మును నేటికీ జమ చేయలేదు. రాష్ట్రంలో యూనివర్సిటీల నిర్వహణ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు రూ.500 కోట్లను ప్రభుత్వం దొంగతనం చేసింది. అందులో జిల్లాలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం వాటా రూ.32 కోట్లు ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, ఉద్యోగ విరమణ చేసిన వారి విషయంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందనే చెప్పాలి. కేవలం జిల్లాకు సంబంధించి పిఎఫ్, పిఆర్‌సి బకాయిలు, ఎపిజిఎల్‌ఐ బకాయిలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, సరెండర్ లీవులు తదితరవన్నీ జిల్లావరకు సంబంధించి ప్రభుత్వం రూ.440 కోట్లు బకాయి పడి ఉంది. అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు సుమారు రూ.400 కోట్ల బకాయిలు ఉన్నాయి. అభివృద్ధి పనులు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందమైంది. జిల్లాలో సుమారు 90 శాతం పనులు నిలిచిపోయాయి. జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి ప్రకటించిన నిధుల జాడ కనిపించడం లేదు. ప్రజా ఉద్యమాలపై నిర్బంధకాండ కొనసాగుతోంది. ధర్నాలకు న్యాయస్థానాల అనుమతి పొందాల్సిన దుస్థితి నెలకొంది. చాంతాడు వంటి వైఫల్యాల పుట్ట వల్లే నాటి ఆదరణ నేడు మంచులా కరిగిపోతుంది. అన్ని వర్గాల ప్రజల్లోనూ పలుస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రత్యామ్నాయం కనిపిస్తే జిల్లా ప్రజలూ అటువైపు వెళ్లిపోతారు. ఇలాంటి తరుణంలో తరిగిపోతున్న ఫ్యాన్ గాలి ప్రజాదరణను నిలువరించే ప్రయత్నం సాగితేనే జగన్ పాలనకు సార్థకత ఉంటుంది.
తరగని నిరాదరణ
జగన్ పాలనా వైఫల్యాలను చిత్తశుద్ధితో ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నంలో వైఫల్యం కారణంగానే తరిగిన చంద్రబాబు ఆదరణ తిరిగి కూడగట్టే ప్రయత్నంలో విఫలమైనట్లు జిల్లాలోని టిడిపి రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి. కమలం నీడలో జగన్‌తో పాటు కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నిలవడమే అందుకు కారణమని జిల్లా టిడిపి నాయకులు గట్టిగా విశ్వసిస్తున్నారు. బాబు పాలనలో జిల్లాలో ఐదేళ్లలో ఆశించిన ప్రగతి కానరాలేదు. ప్రాజెక్టుల పనులు ముందకు సాగలేదు. శ్రీకాకుళంలో కూల్చేసిన స్టేడియాన్ని కట్టగలిగితే శ్రీకాకుళంలో టిడిపి గెలిచేదన్న ప్రచారం నాడు సాగింది. బాబు పాలనలో కొండంత ప్రచారం, పిడికెడంత ఆచరణ ఉండేదని ఆ పార్టీ నేతలే చెప్పే పరిస్థితి ఉంది. తొలి శాసనసభలో జిల్లాకు మంజూరు చేసిన పది ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానినైనా ఆయన శంకుస్థాపన చేసే పరిస్థితి రాలేదు. అందువల్లే ఆయన కొత్త హామీలను జిల్లా ప్రజలు విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదు. ఇసుక మాఫియా గురించి జిల్లాలో అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకులు పరస్పర విమర్శలు చేసుకోవడం చూస్తున్నాం. కానీ రెండు పార్టీల పెద్దలు కలిసి ఇసుక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. అందువల్ల రెండు పార్టీలు కలిసి ప్రజల కళ్లల్లో ఇసుక కొట్టి పాలన చేస్తున్న వైనాన్ని చూశాం, చూస్తున్నాం. జగన్ పాలనపై దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు ప్రత్యామ్నాయం చూపడం లేదని జిల్లాలో ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు. పొత్తులతో ముందుకెళ్తామని తాజాగా చంద్రబాబు ప్రకటించారు. బిజెపితో అయితే నష్టపోతామని జిల్లా నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. రాష్ట్రానికి, జిల్లాకు జరిగిన అన్యాయం గురించి వారు గుర్తుచేసే పరిస్థితి ఉంది. పొత్తుల్లో భాగంగా తొలి దశలో 76 టిడిపి, 16 జనసేన అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిసింది. వాటిలో జిల్లాలో ఇచ్ఛాపురం అశోక్, పలాస శిరీష, టెక్కలి అచ్చెన్నాయుడు, ఆమదాలవలస రవికుమార్ పేర్లు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన పార్టీ సమావేశంలో స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. జనసేన ఎచ్చెర్లను కోరుతున్నందున మాజీ మంత్రి కళా వెంకట్రావును పార్లమెంట్ బరిలో దించాలన్న నిర్ణయమైందని ప్రచారం ఉంది. జిల్లాలో జనసేనకు సంబంధించి అంగ బలం, అర్ధ బలమే కాకుండా రాజకీయంగా గుర్తింపు కలిగిన నేతలెవరూ కనిపించని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో తరగని నిరాదరణను తిరిగి ఆదరణ పొందేలా సైకిల్ ఎలా ముందుకు సాగుతుందో చూడాల్సి ఉంది.
- సత్తారు భాస్కరరావు










