ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : సత్తెనపల్లి మండలం నందిగామ జెడ్‌పి పాఠశాలలో నాడు -నేడు రెండో దశ కింద మంజూరైన అదనపు తరగతి గదుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎఫ్‌ఎఫ్‌ఐ) పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి అమూల్య డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, నాయకులు శుక్రవారం ఉపవిద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ ఇటీవల జెడ్‌పి పాఠశాలలో నాల్గవ తరగతి విద్యార్థి పాముకాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. మురుగు దొడ్లు శుభ్రపరచాలని, మైదానంలో గడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. 450 మంది విద్యార్థులకు 16 మంది మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకాష్, డివైఎఫ్‌ఐ నాయకులు రాజ్‌కుమార్, సాంబశివరావు పాల్గొన్నారు.










