
తరగతి గదిలో అడుగుపెట్టిన ఆ కొత్త ఉపాధ్యాయుడి వైపు ఆసక్తిగా చూస్తున్నారు. పిల్లలందరూ ఎర్రగా, పొడుగ్గా, ముప్పయ్యేళ్లు మించని అతడిని అందరూ కుతూహలంగా గమనిస్తున్నారు. కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడి పట్ల సహజంగా పిల్లలకు కలిగే ఉత్సుకత వాళ్ళ ముఖాల్లో కన్పిస్తోంది. పాత టీచర్ సుశీలమ్మ పది రోజుల క్రితం బదిలీ కాగా, ఆ స్థానంలో వచ్చి, ఆ రోజే స్కూల్లోకి అడుగుపెట్టినాడు ఆయన!
ఏడో తరగతి అది. అరవై మందికి పైగా పిల్లలున్నారు, ఆ తరగతి గదిలో! అందునా 30 మందికి పైగా ఆడపిల్లలున్నారు. ఆ పల్లెటూరి హైస్కూల్లో ఒక తరగతిలో ఈ మాత్రం పిల్లలుండటం, అందులో సగం మంది ఆడపిల్లలుండటం, అతనికి చాలా ముచ్చటగా ఉంది. ఈ మధ్యకాలంలో మగపిల్లల్తో పాటు, అంతకంటే ఎక్కువగానూ ఆడపిల్లలు చదువుకోవడం, మగపిల్లల కంటే బాగా రాణించటం దేశమంతా గమనిస్తూనే ఉంది.
కొత్తగా వచ్చిన ఆ ఉపాధ్యాయుడు, లేచి నిలబడ్డ పిల్లలందర్నీ కూర్చోమని చెప్పి, ''నా పేరు ప్రభాకరం! ఇంతకు మునుపు హంపాపురంలో నాలుగేళ్లు పనిచేసినాను. మీ టీచర్ సుశీలమ్మ గారి స్థానంలో బదిలీ చేసినారు. ఆమెలాగే నేనూ మీకు తెలుగు పాఠాలు బోధిస్తాను.'' అంటూ తన్ను తాను పరిచయం చేసుకున్నాడు.
పిల్లలంతా నిశ్శబ్దంగా చూస్తున్నారతని వైపు. తన్ను తాను అతడు పరిచయం చేసుకున్న తీరులోనే ఒక కొత్తదనం ఉందనిపించింది వాళ్లకు. సుశీలమ్మ మొహంలా చిర్రుబుర్రులాడుతూ కాకుండా, చాలా ప్రశాంతంగా, ప్రసన్నంగా కన్పిస్తోంది అతని ముఖం.
''ముందు మీ అందరి పేర్లూ వరుసగా నాకు చెప్పండి..'' అంటూ మొదటి వరుసలో కూచున్న ఒక అమ్మాయిని లేపి, ''నీ పేరేమిటమ్మా'' అన్నాడు సౌమ్యంగా.
ఆ అమ్మాయి ఉత్సాహంగా ''సుభాషిణి సార్'' అంది. ఆ క్రమంలో వరుసగా అందరూ తమ పేర్లు వినిపించారు అతడికి.
పరిచయాలు పూర్తయ్యాక ''సుభాషిణీ! మొదటగా నిన్ను కొన్ని ప్రశ్నలడిగి పాఠం ప్రారంభిస్తాను'' అన్నాడు.
సుభాషిణి లేచి నిలబడింది. ఏం ప్రశ్నలడుగుతాడా అని పిల్లలంతా విప్పారిన కళ్ళతో నిశ్శబ్దంగా చూస్తున్నారు.
''ఈ పాఠం కూడా కేవలం పరిచయ పాఠము. గాబరాపడకుండా మాట్లాడండి. ఇప్పుడు మనం మాట్లాడే భాషనేమంటారు.'' అని అడుగుతూ ఆ అమ్మాయికి దగ్గరగా వచ్చాడతడు.
'ఓస్ ఇంతేనా!' అన్నట్లు ''తెలుగు భాష సార్'' ఠకీమని జవాబు చెప్పింది ఆ అమ్మాయి.
''సరే! మనం మాట్లాడుకునే ఈ భాషకు మరోపేరు కూడా ఉంది. చెప్పు చూద్దాం'' అన్నాడతడు.
సుభాషిణి క్షణం ఆలోచించి ''ఆంధ్రభాష సార్'' అంది.
''సరిగానే చెప్పినావు. అయితే ఇంకో పేరు కూడా చెప్పగలవా, ఆలోచించు.'' అన్నాడు చిర్నగవుతో..
సుభాషిణి ఆలోచిస్తూ నిలబడిపోయింది.
''రమణా! నువ్వు చెప్పగలవా'' అంటూ మరో విద్యార్థిని అడిగాడు. రమణ లేచి నిలబడినాడు. ఇంకో పేరేమిటబ్బా అంటూ ఆలోచనలో పడిపోయాడు.
''ఎవరైనా చెప్పగలరా?''
రెండో వరుసలో కూచున్న 'ఆశా' లేచి నిలబడి ''మాతృభాష అని కూడా అంటారు సార్.'' అంది విజయోత్సాహంతో..
అతడు మెచ్చుగోలుగా చూస్తూ.. ''చాలా చక్కగా కనిపెట్టేశావమ్మా. మన తెలుగుభాషను మాతృభాష అని కూడా మనం చెప్పవచ్చన్నమాట. సరేనా..'' అన్నాడు. అవునన్నట్లు పిల్లలందరూ తలాడించారు.
''సరే, మాతృభాష అన్న మాటకు అర్థం చెప్పండి చూద్దాం.''
''తల్లి భాష సార్'' అని దాదాపు అందరూ ముక్త కంఠంతో చెప్పేశారు.
''మాతృభాష అంటే తల్లి భాష అని మీరంతా ఒప్పేసుకున్నట్టే గదా! అయితే నాకో అనుమానం 'తల్లి భాష' అనే మనం ఎందుకు పిలవాలి? 'తండ్రి భాష' 'అక్క భాష' అనైనా అనొచ్చుగదా! తల్లి భాషే అని ఎందుకు అంటున్నాం. చెప్పండి చూద్దాం!'' అనడిగాడు ప్రభాకరం.
పిల్లలంతా మళ్లీ ఆలోచనలో పడిపోయారు.
''కృష్ణవేణీ! నువ్వు చెప్పు చూద్దాం!''
ఆ పిల్ల సిగ్గుపడుతూ నిల్చుంది. ''తెలీదు సార్,'' అంది.
పక్కనున్న పిల్ల ''నేను చెబుతా సార్'' అంటూ లేచి నిలబడి, ''అమ్మ దగ్గరే మొట్టమొదట మాటలు నేర్చుకుంటాం గాబట్టి.. అమ్మ దగ్గరే పెరుగుతాం కాబట్టి'' అంది.
''చాలా చక్కని సమాధానం'' అంటూ మెచ్చుకోలుగా, ఆ అమ్మాయి తల నిమిరి, ''మనమంతా చిన్నప్పుడు తల్లి ఆలనా, పాలనా, లాలనలతో పెరుగుతాం కదా! అందువల్ల మొదట తల్లి నోటి నుండే మనం భాషను నేర్చుకుంటాం. కాబట్టే మనం మాట్లాడే భాషను మాతృభాష అంటాం. అవునా! మనమే కాదు, ప్రపంచంలో అన్ని భాషలూ మాట్లాడేవాళ్లు, తమ భాషను ''మాతృభాషే'' అంటారు.'' అన్నాడు వివరిస్తున్న ధోరణిలో.
ఔనౌను అన్నట్టు పిల్లలంతా తలాడించారు.
''కాబట్టి మనం మొదట ఎవరికి రుణపడి ఉండాలి?''
''అమ్మకే, అమ్మకే,'' పిల్లలంతా ముక్తకంఠంతో నినదించారు. ప్రభాకరం ముఖం ప్రఫుల్లమయింది.
''మీరంతా జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి.. తల్లి తన పిల్లల్ని ఎలా సాకి సంరక్షిస్తుందో.. పుట్టిన శిశువును ఎంత పొందికగా, ఎంత ఒద్దికగా, ఎంత సున్నితంగా కాపాడుతుందో? ముఖ్యంగా తల్లి పసిపిల్లకు స్నానం చేయించడం మీరెవరైనా పరిశీలనగా గమనించారా!'' అడిగాడు ప్రభాకరం.
''చూసినాం సార్'' అన్నాడు రవి అనే అబ్బాయి.
''అయితే లేచి చెప్పు చూద్దాం.. అందరూ వింటారు.'' అని ప్రశ్నించేసరికి, ఎలా చెప్పాలో తెలియక నిల్చుండిపోయాడు రవి.
''నేను చెబుతాన్ సార్'' లేచి నిల్చుంది సుభాషిణి.
''చెప్పమ్మా'' అన్నాడు ఆ పిల్లవైపు లాలనగా చూస్తూ.
''అమ్మ కాళ్లు చాపి, కాళ్ళ మీద బోర్లా పడుకోబెడుతుంది సార్, దోసిళ్లలో నీళ్ళు తీసుకుని తల మీద, వీపు మీద, కాళ్ల మీద మెల్లగా తడుతుంది సార్.. శనగపిండితో తల రుద్దుతుంది సార్, కాళ్లూ చేతులూ లాగి తోముతుంది సార్, నోట్లో వేలు పెట్టి నాలుక మీదున్న గల్లను తీసేస్తుంది సార్. ముక్కు అదిమి చీమిడి తీస్తుంది సార్..'' ఇలా స్నాన ఘట్టాన్ని తన్మయంతో వివరిస్తోంది సుభాషిణి. తన తల్లి రోజూ తన తమ్ముడికి స్నానం చేయించే సన్నివేశం గుర్తు తెచ్చుకుంటూ చెబుతూంటే పిల్లలందరూ పులికించిపోతూ వింటున్నారు.
''అంటే ప్రతి చిన్న పని నుండి తల్లి, తన పిల్లలకు ఎన్నెన్నో పనులు చేసి పెడుతుంది. పిల్లల్ని ఇలా జాగ్రత్తగా పెంచి, పెద్ద చేయటంలో తండ్రి పాత్ర ఏ మేరకు ఉందో మీరెప్పుడైనా ఆలోచించారా?''
పిల్లలంతా ఒకరి ముఖాలు ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు.
వాళ్ళ భావాలు అర్థమై ''సరే, నేను కొన్ని ప్రశ్నలడుగుతాను జవాబులు చెప్పండి.'' అన్నాడు ప్రభాకరం. పిల్లలు తలలూపినారు.
''చాలా చిన్న ప్రశ్నలే, మీ నాన్న మీకెప్పుడైనా స్నానాలు చేయించి, బట్టలు తొడిగి, తల దువ్వినాడా?''
పిల్లలు ఇదేం ప్రశ్న అనుకున్నారేమో, నాన్న ఎందుకు చేస్తాడనుకున్నారేమో ''లేదు సార్'' అన్నారు.
''మీ ముడ్డి ఎప్పుడైనా కడిగినాడా''
''ఛీ! ఛీ!'' అన్నట్లు మొహాలు పెట్టి ''అబ్బే..'' అన్నారు.
''పోనీ, మిమ్మల్ని చంకలో కూచుండపెట్టుకొని, అన్నం ముద్దలు తినిపించినాడా?''
ఏమిటి సారు ఇలాంటి అర్థంలేని ప్రశ్నలు వేస్తున్నాడనిపించిందేమో ''ఎప్పుడూ చేయలేదు గదా!'' అన్నారు.
''మీకు ఊయల ఊపినాడా''
''లేదు సార్''
''మీకు జ్వరం వస్తే మీ పక్కన కూచుని, రాత్రిళ్లు నిద్ర మేల్కొన్నాడా?''
''లేనే లేదు సార్''
''మీరు బయటకెళ్తే మీరొచ్చేదాకా మీ కోసం ఎదురుచూస్తూ మీ నాన్న మీకెప్పుడైనా కనిపించాడా?''
''అయ్యో లేదే..?''
''సరే, మీ జవాబులన్నీ నిజమైనవే! అయితే ఈ పనులన్నీ మీకు చేసి పెడుతున్నది ఎవరర్రా?'' పిల్లల ముఖాలను ప్రేమగా చూపులతో స్పర్శిస్తూ అడిగాడాయన.
''అమ్మే! మా అమ్మే'' అంటూ గది మ్రోగేట్టు పిల్లలంతా గట్టిగా అరిచినారు.
''మా నాన్న అసలు ఇంట్లోనే ఉండడు సార్'' అని కంప్లయింట్ చేసింది ఓ అమ్మాయి.
''మా పనీ, ఇంటి పనీ అంతా మా అమ్మే చేస్తుంది సార్! ఇంటి పని కాగానే తోట దగ్గరకు వెళ్తుంది సార్'' అన్నాడు ఓ అబ్బాయి.
సుభాషిణికైతే తన ఇల్లే గుర్తుకొస్తోంది. తన అమ్మే గుర్తుకొస్తోంది. పొద్దున బాగా తెల్లారకముందే నిద్ర లేస్తుంది అమ్మ. పాలు పితుకుతుంది. ఇల్లంతా కసవులు ఊడుస్తుంది. అంట్లన్నీ తోముతుంది. ఇల్లంతా సర్దుతుంది. కాపీలు చేసి ఇస్తుంది. నాన్న బయట వసారాలో కూచుని, అన్నిటికీ ఆర్డర్లు వేస్తుంటాడు. తాగిన కాఫీ గ్లాసును కూడా పక్కకు పెట్టడు. తనకూ తమ్ముడికీ స్నానాలు చేయిస్తుంది. బట్టలు వేస్తుంది. వంటి చేసి వడ్డించి, తన్ను బడికి పంపించేదాకా అమ్మకు ఒక్కటే హడావుడి. అన్నీ గుర్తు తెచ్చుకుంటోంది సుభాషిణి.
''మీకు ఎన్నెన్నో పనులు చేసి పెట్టే అమ్మంటే మీకందరికీ ఇష్టమే గదా. మాతృభాష అంటే ఎంత ఇష్టమో తల్లి అంటే కూడా అంతే ఇష్టం ఉండాలి.'' ప్రభాకరం పిల్లల్ని ప్రశ్నిస్తున్నాడు.
''అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు?'' ఆలోచనల్లోంచి బయటపడుతూ గట్టిగా అనేసింది సుభాషిణి.
పిల్లలంతా ''అమ్మంటే మా కిష్టం'' అన్నారు గట్టిగానే.
''రవీ, నువ్వు లేచి నిలబడు'' అన్నాడు ప్రభాకరం.
రవి లేచి నిలబడినాడు. తన్ను పేరు పెట్టి పిల్చినందుకు సంబరపడిపోయినాడు రవి. సుశీల మేడం అయితే ఎప్పుడూ ''రేరు, వోరు'' అని పిలుస్తుందేగానీ పేరు పెట్టి పిలవదు. కోపం వచ్చినప్పుడైతే ''గాడిదా, వెధవా, ఫూల్'' అంటూ ఒకటే తిట్లు. అవి చాలక బెత్తాలతో దెబ్బలు. ఈ సార్ ప్రేమగా పేరుతో పిలుస్తున్నాడు. చేతిలో బెత్తమే లేదు. రవికి హాయి అనిపించింది.
ప్రభాకరం రవి దగ్గరగా వచ్చి ''రవీ! నువ్వు అన్నం దేట్లో తింటావ్'' అనడిగాడు.
''కంచంలో సార్''
''తిన్న తరువాత ఏం చేస్తావ్''
ఇదేమిటి సార్ ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడనుకుంటూ, ''చేయి కడుక్కుంటాను సార్'' అన్నాడు.
''ఆ తర్వాత''
''మూతి తుడుచుకుంటాను సార్''
''ఆ తర్వాత''
''కంచం ముందు నుంచీ లేచి వస్తాను''
''అయితే నీ కంచం ఎవరు కడుగుతారు?''
''మా అమ్మ కడుగుతుంది సార్''
''సరే! నువ్వు కూచో'' అని ''భారతీ! నువ్వు లేచి నిల్చో'' అంటూ ఆ పిల్ల దగ్గరకు నడిచాడు.
''భారతీ! నువ్వు అన్నం తిన్న తరువాత ఏం చేస్తావ్'' అనడిగాడు..
''చేతులు కడుక్కుంటాను.''
''అది సరే, ఆ తర్వాత''
''నేను తిన్న కంచం కడిగి బోర్లిస్తాను'' అంది చాలా సహజంగా.
''ఇప్పుడు చెప్పండి! రవి చేసిన పని సరైనదా? భారతి చేసిన పని సరైనదా?'' అని ప్రభాకరం వేసిన ప్రశ్నకు ''భారతి చేసిన పనే సరైంది సార్'' అన్నారు చాలా మంది పిల్లలు. కొంత మంది పిల్లలకు ఇది నచ్చినట్లు లేదు. మౌనంగా ఉండిపోయారు.
''మగపిల్లలందరూ తమ కంచాల్ని తాము కడగరు. ఆడపిల్లలైతే తాము తిన్న కంచాల్ని తామే శుభ్రంగా కడిగేస్తారు. అవునా?'' అని తేల్చి చెప్పాడు ప్రభాకరం. ''అవును సార్ అన్నారు'' ఆడపిల్లలు మరీ గట్టిగా.
''ఇందాక మీరంతా మీ అమ్మ చేసే పనులు మీకిష్టం అన్నారు కదా! మరి మీ అమ్మ కంచాలు కడిగే పనిని మీరెందుకు చేయకూడదు?''
మగపిల్లలు గుసగుసలు పోతున్నారు. ఉపాధ్యాయుడు చెప్పే సంగతులు కొత్తగా అనిపిస్తున్నాయి వాళ్ళకు.
''ఆడపిల్లలు, వాళ్ళమ్మ చేసే పనులన్నీ తాము కూడా చేస్తారు. మగ పిల్లలు మాత్రం చేయరు. అవునా''
''అవును సార్''
''తాము, తిన్న కంచాల్ని తామే కడుక్కోవటం మంచిపని అని మీరు ఒప్పుకుంటారా, చెప్పండి''
''ఒప్పుకుంటాం సార్'' మగపిల్లలు గొంతు కలిపారు.
''అయితే రేపటి నుంచి మీ కంచాలు కడిగే పని మీరే చేయాలి. అలా అయితేనే మీ అమ్మంటే మీకిష్టం''.
''చేస్తాం సార్''
''నిజంగా''
''నిజంగా సార్''
''అంతే కాదు. మీ అమ్మ చేసే పనులన్నీ మీరు కూడా చేయటం అలవాటు చేసుకోవాలి. మీ అమ్మ పట్ల మీకు గల ప్రేమను ప్రకటించుకోవాలి''
''అలాగే సార్'' అన్నారు మగపిల్లలందరూ.
''అమ్మ చేసే పనులన్నీ ఎవరు చేస్తారో వాళ్లే మంచిపిల్లలు! వాళ్లే గొప్పవాళ్లు. అప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మరింత ప్రేమిస్తుంది. ఆడపిల్లలు తల్లి చేసే పనులన్నీ చేస్తారు. గాబట్టి, ఆడపిల్లలే మీకంటే మంచివాళ్లు'' అంటూ నచ్చచెప్పే ధోరణిలో మాట్లాడుతున్నాడు ప్రభాకరం.
ఆ చిన్న వయస్సులోనే మగపిల్లలు అహం దెబ్బతిన్నదేమో, ''లేదు సార్, మేము కూడా మంచివాళ్ళమే'' అన్నారు.
''అయితే మీరు కూడా ఆడపిల్లలు చేసే పనులన్నీ చేసి మీ మంచితనం నిరూపించుకోవాలి. చేస్తారా మరి?''
''చేస్తాం సార్''
''అయితే వినండి! ఇప్పటి నుండీ మీరు, మీ పనులకు ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆధారపడకూడదు. మీ పనులన్నీ మీరు చేసుకోవాలి. మీ పరుపులు మీరే పరచుకోవాలి. నిద్ర లేవగానే మీరే చుట్టి పెట్టాలి. పొద్దునే పరక తీసుకుని, ఇల్లంతా కసువులు ఊడ్చాలి.''
మగ పిల్లలకు కసవు వూడ్చటం మింగుడు పడినట్లు లేదు. మౌనంగా వుండిపోయారు. ఆడపిల్లలు కిలకిలా నవ్వేస్తున్నారు.
''ఏం ఆ పని తప్పా? ఇంటిపనిలో ఆడపని, మగపని అని వేర్వేరుగా చూడకూడదు. ఇంతకాలమైనా ఆడవాళ్లే పరక పట్టి కసువు పూడ్చటం చూసి చూసి ఇది ఆడపని అని అనుకుని ఉంటారు. ఇంటిని శుభ్రపరచుకోవటం అనేది అందరి పని! మీ తల్లి చేసే పనులన్నీ మీకిష్టమే అన్నారు కదా! అమ్మ చేసే ఈ పనిని మీరెందుకు చెయ్యకూడదు.''
''చేస్తాం సార్, రేపట్నుంచీ ఇంట్లో కసువు మేము వూడుస్తాం'' అన్నారు మగపిల్లలు.
''వెరీ గుడ్! చాలా మంచి పిల్లలవుతారు మీరు. ఆడపిల్లల్లాగే మీరు కూడా ఇంటిపనిలో భాగస్వాములు కావాలి. అంట్లు తోమటం నేర్చుకోవాలి. అన్నం చేయటం నేర్చుకోవాలి. బట్టలుతకటం అలవాటు చేసుకోవాలి. అన్ని పనుల్లోనూ మీ తల్లికి సాయంగా ఉండి, ఆమె మెప్పు పొందాలి. మీ పనుల భారాన్ని మీ అమ్మ మీదో, మీ అక్క మీదో, మీ చెల్లి మీదో వేయకూడదు. అప్పుడే మీరు సంస్కారవంతమైన పిల్లలవుతారు.'' ఇలా ప్రభాకరం చెబుతుంటే పిల్లల మనసుల్లో కొత్త తలుపులు తెరుచుకుంటున్నాయి.
''అన్ని పనులూ ఇక మేమే చేస్తాం సార్'' అన్నారు మగపిల్లలంతా..
''అలా చేస్తే మిమ్మల్ని మీ తల్లి మరింత బాగా ప్రేమిస్తుంది. ఆడపిల్లలు కూడా మిమ్మల్ని గౌరవంగా చూస్తారు. అంతే కాదు, మీరు కూడా ఆడపిల్లల్ని తక్కువ చూపు చూడకుండా సమానంగా చూస్తారు'' అంటుండగా పిరియడ్ పూర్తయినట్లు బెల్లు కొట్టిన శబ్దం వినిపించింది.
''రేపు మళ్లీ వస్తాను, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం! ఇది కూడా పాఠమే సుమా!'' అని చిరునవ్వుతో పిల్లల్ని పలకరిస్తూ గది నుండి బయటకు నడిచాడు ప్రభాకరం.
* సింగమనేని నారాయణ