ఇబ్బంది పడుతున్న వినియోగదారులు
ప్రజాశక్తి -సీలేరు
జీకే వీధి మండలం సీలేరులోని యూనియన్ బ్యాంక్ ఎటిఎం తరచూ మరమ్మతులకు గురి కావడంతో ఖాతాదారులు, వినియోగదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటీఎం ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు పని చేయదో తెలియని పరిస్థితి నెలకొందని ఖాతాదారులు అంటున్నారు. ఏటీఎం తరచూ మరమ్మతులకు గురికావడంపై అనేకసార్లు బ్యాంకు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. బ్యాంకు సెలవు దినాల్లో ఏటీఎం పనిచేయకపోతే నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నగదు తీసుకోవడానికి డిపాజిట్ చేయడానికి ఒక్క ఏటీఎం మాత్రమే ఉండడంతో అనేక సమస్యలకు గురు కావలసి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడం, ఏటీఎం పనిచేయకపోవడంతో సీలేరులో వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏటీఎం పని చేసేలా, ప్రతిరోజు నగదు పొందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.










