Apr 06,2023 22:47

కొత్త ప్రాంతంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను పరిశీలిస్తున్న మేయర్‌, తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరంలో ట్రాఫిక్‌నకు అడ్డుగా ఉన్న విగ్రహాలను గుర్తించి, అడ్డులేని ప్రాంతంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు చెప్పారు. వాటిని ఏర్పాటు చేసిన పెద్దలతో మాట్లాడి, వారి మనోభావాలు దెబ్బ తినకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరంలోని ఎత్తురోడ్డు సెంటర్‌లో కొన్ని దశాబ్దాల క్రితం మహాత్మ గాంధీ, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ, వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఏర్పాటు చేశారని, ప్రస్తుతం నగరం విస్తరించి, వాహనాల రద్దీ బాగా పెరిగిందని అన్నారు. చిలకలూరిపేట, నర్సరావుపేట, ప్రత్తిపాడు, పర్చూరుకు వెళ్లి వచ్చే వాహనాలకు ఎత్తురోడ్డు జంక్షన్‌గా మారిందన్నారు. ప్రస్తుతం అవి ట్రాఫిక్‌నకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో స్థానిక పెద్దలతో మాట్లాడి ట్రాఫిక్‌నకు అంతరాయం లేని రోడ్డు మార్జిన్‌ ప్రాంతంలో ఏర్పాటుకు ఒప్పించగా, ఆ పనులను మేయర్‌ గురువారం పరిశీలించారు. విద్యాసంస్థల వెళ్లే బస్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకొని సకాలంలో వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని, ఆ విగ్రహాలను రోడ్డు మార్జిన్‌లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నగరంలో ఇంకా ట్రాఫిక్‌నకు అడ్డుగా ఉన్న విగ్రహాలను గుర్తించి, స్థానిక పెద్దలతో మాట్లాడి, సదరు విగ్రహాలను ట్రాఫిక్‌నకు అంతరాయం లేని ప్రాంతంలో ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ నిమ్మల వెంకటరమణ, పోలీస్‌ అధికారులు, నగర పాలక సంస్థ డిఇఇ రమేష్‌బాబు, ఇంజినీరింగ్‌ సిబ్బంది, ఎడిహెచ్‌ రామారావు పాల్గొన్నారు.