జిల్లా కేంద్రమైన తర్వాత మూడింతలు పెరిగిన రద్దీ
అమలుకు నోచుకోని మూడు రోడ్ల అభివద్ధి ప్రతిపాదన
ఇరుకు రోడ్లతో నిత్యం ప్రజలు, వాహనదారుల ఇక్కట్లు
ప్రజాశక్తి పాడేరు: అల్లూరి జిల్లా కేంద్రమైన తర్వాత పాడేరులో వాహన రాకపోకల రద్దీ గణనీయంగా పెరిగింది.పాడేరు పరిసరాల్లో వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం, లంబసింగి వంటి ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. దీనికి తోడు జిల్లా కేంద్రం కావడంతో ఇప్పటికే ఉన్న ఐటిడిఎ కార్యాలయంలోపాటు కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, డిఆర్‌డిఎ వంటి పలు జిల్లాస్థాయి అధికారుల కార్యాలయాల ఉండడంతో వివిధ పనులపై వచ్చే ప్రజల సంఖ్యకూడా పెరిగింది. దీంతోపాటు పాడేరు పట్టణంలో మెడికల్ కళాశాల, పాడేరు నుంచి అరకులోయకు హైవే రోడ్డు నిర్మాణం వంటి అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ఫలితంగా జిల్లా కేంద్రం పాడేరుకు వచ్చే బైక్‌లు, కార్లు, బస్సులు ఇతర వాహనాలతోపాటు వాటిల్లో వచ్చేవారి సంఖ్య కూడా పెరగడంతో పాడేరు పట్టణవీధుల్లో జన, వాహనరద్దీ కనిపిస్తోంది. దశాబ్ధకాలంలో ప్రతిపాదనలే తప్ప అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లో పాడేరు పట్టణంలో మెయిన్‌రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడం, మరోవైపు వాహనరద్దీ పెరగడంతో పాడేరు పట్టణం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయినట్లు కనిపిస్తోంది.
పాడేరు పట్టణానికి ఒక చివరన కలెక్టరేట్, మరో చివరన జిల్లా పోలీస్ కార్యాలయం ఉంది. వీటి మధ్య దూరం మూడు కిలోమీటర్లే అయినప్పటికీ, అది పాడేరు పట్టణంలోని మెయిన్ రోడ్డు కావడమే ట్రాఫిక్ సమస్యకు కారణమౌతోందని చెప్పాలి.ఇక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి పాడేరు పట్టణ నడిబొడ్డులో ఉంది. అత్యవసర వైద్య సేవల కోసం చుట్టుపక్కల పది మండలాల నుంచి జిల్లా ఆస్పత్రికి రావడానికి ఇదే మెయిన్ రోడ్డు మీదుగా రావాలి.దీంతో ఒక్కొక్కసారి రోగుల్ని తీసుకువచ్చే అంబులెన్స్ లు ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నాయి.
అమలుకు నోచుకోని మూడు రోడ్ల అభివృద్ధి ప్రణాళిక
పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి ఉండే మూడు రోడ్ల అభివృద్ధి ప్రణాళిక నాలుగేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే మూడు రోడ్ల అభివృద్ధికి ఆర్ అండ్ బి అధికారులు అంచనా ప్రతిపాదనలు రూపొందించినా, తర్వాత ప్రభుత్వం మారడంతో నిధులుమంజూరులేక రోడ్డు విస్తరణ కార్యారూపం దాల్చలేదు. జిల్లా కేంద్రమైన తర్వాతైనా పెరుగొతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరణ జరుగుతాయని భావించినా ఆ దిశలో ఎటువంటి పురోగతి లేదు. పాడేరులో రోడ్ల విస్తరణతోపాటు, పాదచారుల రాకపోకలకు ప్లాట్‌ఫామ్స్ నిర్మించాల్సిన తక్షణ అవసరం ఉంది.
పోలీసులకు పరీక్షగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా ఇక్కడ రోడ్లు విస్తరణ, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో వాహనాలను నియంత్రించడం ఇబ్బందికరంగానే మారిందని చెప్పాలి. దీనికి తోడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలకు వివిధ సరుకులతో వచ్చే లారీలను అన్‌లోడింగ్ కోసం మెయిన్‌రోడ్డులోనే నిలిపేస్తున్న పరిస్థితుల్లో ట్రాఫిక్ జఠిలమౌతోంది. ఒకచోట నిలిపిన వాహనం కదిలితే, మరోవాహనం వచ్చి ఆగుతుండడం వల్ల రోజంతా ఇరుకురోడ్డు మరింత ఇరకాటంగా మారుతోంది. హోటళ్లు, ఇతర దుకాణాలకు వచ్చే కొనుగోలు, వినియోగదారులు తమ బైక్‌లు, ఇతర వాహనాలను రోడ్డు పక్కనే నిలిపేస్తున్నారు. రోడ్డు పక్కనున్న దుకాణదారులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోడ్డుపొడుగునా బైక్‌లు, కార్లు, లారీలు ఇతర వాహనాలను ఎక్కడికక్కడే నిలిపేస్తుండడంతో ఇప్పటికే ఇరుకుగా ఉన్న రోడ్డులో రాకపోకలకు మరింత ఇక్కట్లు తప్పడం లేదు.
డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడే 11మండలాల నుంచి వచ్చేవారితో రద్దీగా ఉండే పాడేరు, ఇపుడు జిల్లా కేంద్రం కావడంతో 22మండలాలకు చెందిన ప్రజలతో కిటకిటలాడుతుందనే చెప్పాలి, మరోవైపు పర్యాటక కేంద్రాల సందర్శనకు వచ్చేవారి సంఖ్యకూడా ఇటీవలకాలంలో గణనీయంగా పెరిగింది. ఇలా అన్ని విధాలుగా ప్రజలు, వాహనరాకపోకలు పెరిగినప్పటికీ, దానికి అనుగుణంగా రోడ్ల విస్తరణ, అభివృద్ధి మాత్రం జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్‌ను నియంత్రించే పోలీసుల సంఖ్యను పెంచినా నామమాత్రపు ప్రయోజనమే ఉండే వీలుంది. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదినన రోడ్లు విస్తరణ, అభివృద్ధి చేపట్టడంతోపాటు వాహన రాకపోకలను నియంత్రించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.










