Apr 03,2023 00:33
మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య

ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య కోరారు. ఆదివారం కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో ఆయన విలేకరుల సమా వేశం నిర్వహించి మాట్లాడారు. పట్టణంలో నుంచి నాన్‌ ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు దాదాపుగా నాలుగు కిలోమీటర్లు వెళుతుందని, ఇదే క్రమంలో బయట నుంచి భారీ వాహనాలు ప్రయాణం చేస్తున్నాయని అన్నారు. ఈ సమయాలలో ట్రాఫిక్‌ సమస్యతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల కాలంలో అనేకమంది మత్యువాత పడ్డారని గుర్తు చేశారు. పట్టణంలో బైపాస్‌ రోడ్డు నిర్మాణం ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వతమైన పరిష్కారమని పేర్కొంటూ గతంలో అనేకమంది మేధావులు, ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. రాజకీయ సంకల్పం లేకపోవడంతో ఈ బైపాస్‌ నిర్మాణ అంశం ముందుకు సాగలేదన్నారు. బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరిగితే తప్ప పట్టణ ప్రజలు కష్టాలకు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. పట్టణ పడమర వైపు నుంచి తూర్పు వైపు రోడ్డు దాటడానికి ఇప్పటికే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా ఆయిల్‌ మిల్‌ రోడ్‌, ఎస్బిఐ రోడ్డులో పలు విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో తాగునీటి పైపులైన్‌ నిర్మాణాలు కాంట్రాక్టర్‌ ద్వారా జరుగుతున్నాయని, ఆ కాంట్రాక్టర్‌ పైపులైన్లు వేయడానికి గోతులు తీసి పైపులైన్లు వేసి అలానే వదిలేయడం ద్వారా ప్రధాన వీధుల్లో రోడ్లు గుంతలమయం కావడంతో పాటు నిత్యం ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందని పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలో అంతర్గత రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయని, ఎక్కడికక్కడ మురుగునీరు పారుదల లేకుండా నిలిచి ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయన్నారు. అభివృద్ధి పేరిట రోడ్లు మరింత దారుణంగా తయారు చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ప్రజాసంఘాలు, ప్రజలను కలుపుకొని పోరాటాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, పోనక రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.