ప్రజాశక్తి - ఏలూరు
వేసవి తాపం నుండి జిల్లా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏలూరు రేంజ్ డిఐజి జివిజి అశోక్ కుమార్, జిల్లా ఎస్‌పి డి.మేరీ ప్రశాంతి తెలిపారు. ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ వెల్ఫేర్ కిట్లను ఏలూరు రేంజ్ కార్యాలయంలో ఆదివారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వేసవి తాపం నుండి ట్రాఫిక్ సిబ్బంది రక్షణ పొందేందుకు వీటిని అందించామన్నారు. ఈ సమ్మర్ కిట్‌లో ఎండ తీవ్రత నుండి కాపాడే సమ్మర్ హ్యాట్స్, సన్/కూలింగ్ గ్లాసెస్, చల్లదనం ఉంచే వాటర్ బాటిళ్లు, ఒఆర్‌ఎస్‌ఎల్ ప్యాకెట్లు, అలాగే రాత్రి సమయాల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి ప్రమాదాలు జరగకుండా లైటింగ్ బ్యాట్, రేడియం రిఫ్లెక్టింగ్ సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయని తెలిపారు. ట్రాఫిక్ సిబ్బంది నిత్యం మండుటెండలో విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుందని, తీవ్రమైన ఎండలో దుమ్ము, ధూళి లెక్కచేయకుండా విధులు నిర్వర్తించే వారికి వేసవితాపం నుండి స్వీయ రక్షణ చాలా అవసరమని చెప్పారు. ఎండకు డీహైడ్రేషన్ కాకుండా నీరు బాగా తాగాలని, వడ దెబ్బ వంటి ప్రమాదకర పరిస్థితులకు లోను కాకుండా ఒఆర్‌ఎస్, నిమ్మరసం, మజ్జిగ వంటి ద్రవాలు సేవించాలని, వేసవిలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమని, వేసవిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలకు మెరుగైన సేవలందించాలని, విధి నిర్వహణలో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పోలీస్ సిబ్బంది సంక్షేమంలో ఎంతో శ్రద్ద తీసుకుంటూ వేసవిలో నాణ్యమైన సమ్మర్ కిట్‌ను అందించిన డిఐజి, ఎస్‌పికి జిల్లా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో బ్యూరో అదనపు ఎస్‌పి ఎన్.సూర్యచంద్రరావు, ఎఆర్ అదనపు ఎస్‌పి శేఖర్, ఎఆర్ డిఎస్‌పి కృష్ణంరాజు, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ ఎం.సుబ్బారావు, ఏలూరు టూ టౌన్ ఎస్‌ఐ పి.చంద్రశేఖర్, ఏలూరు త్రీటౌన్ ఎస్‌ఐ వరప్రసాద్, ఏలూరు వన్ టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ, ఏలూరు ట్రాఫిక్ ఎస్‌ఐ బుద్దల శ్రీనివాసరావు, శ్రీధర్ వెంకటేశ్వరరావు, నూజివీడు ట్రాఫిక్ ఎస్‌ఐ రాధాకృష్ణ రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










