ట్రాఫిక్ నియంత్రణకు 500 ఐరన్ బ్యారికేడ్స్ వితరణ
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: తిరుపతి నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు దాతలు అందజేసిన 500 ఐరన్ బ్యారికేడ్స్‌ను పోలీస్ కంట్రోల్ రూమ్‌కు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మంగళవారం అందజేశారు. పోలీస్ పెరేడ్ మైదానంలో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరం రోజురోజుకి విస్తరిస్తున్నందని, అదే సమయంలో జనాభా కూడా పెరగడంతో పాటు, వాహనాల వాడకం కూడా పెరగడంతో నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్నదని అన్నారు. అంతేకాకుండా తిరుపతి మహాపుణ్య క్షేత్రం అయినందు వలన నిత్యం తిరుమలకు వచ్చే భక్తుల వాహనాల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోందని, సరాసరి రోజుకి 20వేల వాహనాల రాకపోకలు నిర్వహణ జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో తిరుపతి పట్టణ ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ చాలా కష్టతరంగా మారుతున్నదన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా పోలీస్‌శాఖ, మున్సిపాలిటి అండ్ జాతీయ రహదారుల అధికారులతో కలిసి తిరుపతిలో ట్రాఫిక్ సిగల్స్‌ను, బ్యారికేడ్స్‌ను, ఇతర వ్యవస్థలను మెరుగుపరుస్తూ, వారితో సమన్వయం చేసుకుంటూ అన్నీరకాల సదుపాయాల ఏర్పాటుతో శులభతరంగా ట్రాఫిక్ ప్రవాహం జరిగేలా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పిలు వెంకట్రావు, కులశేఖర్, డిఎస్పిలు సురేంద్ర రెడ్డి, యశ్వత్, చంద్రశేఖర్, చలపతి, కంట్రోల్ రూమ్ ఎస్‌ఐ సుబ్బా రాయుడు, యాక్ట్ ఫైబర్ నెట్, డిజిటల్ సర్వీసెస్ సంస్థ అడ్వటైస్మెంట్ టీం లీడర్ హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.










