ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : పట్టణంలోని వ్యాపారస్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సిసి కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని డిఎస్‌పి కేశప్ప తెలిపారు. పట్టణంలోని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలలో భాగంగా శుక్రవారం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెహ్రూబజార్, శాస్త్రీవీధి, అప్పారావు స్ట్రీట్, ఆర్‌ఆర్ స్ట్రీట్ వ్యాపారస్తులు ట్రాఫిక్ నిబంధనల దష్ట్యా ఒకరోజు రోడ్డుకు ఎడమవైపు మరొక రోజు రోడ్డుకు కుడి వైపు వ్యాపారస్తులు టూ వీలర్స్ పార్కింగ్ చేయించి సామాన్య ప్రజలకు ట్రాఫిక్‌కు ఎలాంటి అవాంతరాలులేకుండా చూడాలని సూచించారు. రోడ్లు వెడల్పు తక్కువగా ఉన్నందువల్ల పట్టణ జనాభా ఎక్కువగా ఉన్నందున కొన్నిచోట్ల ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని అందుకోసం వ్యాపార వర్గాలు, ప్రజలు కూడా సహకరించాలని తెలిపారు. షాపుల ముందు నో పార్కింగ్ బోర్డులు, వన్‌సైడ్ పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సరుకులు లోడింగ్ అన్‌లోడింగ్ వ్యవహారాలు రాత్రి 10 గంటల తర్వాత చేయించుకోవాలని వ్యాపారులకు తెలియజేశారు. ప్రతి ఒక్క దుకాణదారుడు సిసి కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని వాటిని రోడ్డుకు కూడా కవర్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ లోపల అందరూ తప్పకుండా సిసి కెమెరాలు పట్టణంలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. తాము తనిఖీ చేసి సిసి కెమెరాలు లేని దుకాణదారులకు నోటీసులు ఇస్తామన్నారు. పట్టణంలో నేరాల నియంత్రణకు శాంతిభద్రతల పరిరక్షణకు సిసి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఎస్.మహబూబ్ బాషా, వన్ టౌన్ ఎస్‌ఐ హరిహర ప్రసాద్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.










