
ప్రజాశక్తి-విజయవాడ : ప్రాణం చాలా విలువైనదని, తమపై ఆధారపడిన కుటుంబం కోసం ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను విధిగా పాటించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 32వ డివిజన్ రామలింగేశ్వరపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై నిర్వహించిన అవగాహన ర్యాలీలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషణితో కలిసి ఆయన పాల్గొన్నారు. బాల్యం నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. అలాగే రోడ్డుపై ప్రయాణించే సమయంలో సిగల్ లైట్లను ఫాలో అవ్వాలని, ఎదుటి వాహనాలను ఓవర్ టేక్ చేయడం వంటివి చేయకూడదని సూచించారు. నిర్లక్ష్యం, అతివేగం అనర్ధానికి దారితీస్తుందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు పాటించి క్షేమంగా గమ్య స్థానాలకు చేరాలన్నారు. హెల్మెంట్ ధరించి వాహనం నడపడం వల్ల అనుకోని పరిస్థితిలో ఎలాంటి ప్రమాదం వాటిల్లినా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చన్నారు. నగరం నానాటికి విస్తరిస్తున్న తరుణంలో పెరుగుతున్న జనాభాను దష్టిలో పెట్టుకుని.. సెంట్రల్ ప్రాంతంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.