Nov 17,2023 23:09

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కాకినాడ ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకుంది. నగరానికి రాకపోకలు సాగించేవారు సంఖ్య భారీగా పెరగడంతో తరచూ రద్దీ నెలకొంటోంది. స్మార్ట్‌ సిటీగా ఎంపికైన తర్వాత రోడ్ల విస్తరణ జరిగినప్పటికీ ట్రాఫిక్‌ సమస్య మరింత పెరిగింది. ప్రధాన కూడళ్ళలో నిమిషాలు తరబడి వాహనాలు చిక్కుకుంటున్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించడం లేదని ట్రాఫిక్‌ పోలీసులపై విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దీకి కారణమవుతున్న కొందరితో ఒకలా మరికొందరితో మరోలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కాకినాడ నగరంలో సుమారు 5 లక్షలు వరకు రెండు చక్రాల వాహనాలు, 17 వేల ఆటోలు, 16 వేలు గూడ్స్‌ వెహికల్స్‌, 1700 వరకూ ప్రైవేటు స్కూళ్ల బస్సులు, దాదాపు 33 వేల వరకూ కార్లు ఉన్నట్లు అధికారుల అంచనా. సర్పవరం, నాగమల్లితోట, బానుగుడి, టూ టౌన్‌, మసీదు సెంటర్‌, జగన్నాథపురం వంతెన, భావన్నారాయణ గుడి, మున్సిబు ఘాటీ, బాలాజీ చెరువు, జిల్లా పరిషత్‌, ఇంద్రపాలెం, కల్పన తదితర ప్రధాన సెంటర్లు నిత్యం రద్దీగా ఉంటాయి. కోకిలా సెంటర్‌, గాంధీబొమ్మ, డైరీపాం, డీమార్ట్‌, రామారావుపేట తదితర కూడళ్ల వద్ద కూడా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు టాపిక్‌ సమస్య వల్ల ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఈ సమయంలో విధులకు హాజరయ్యే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ వ్యాపారాల నిమిత్తం వెళ్లేవారు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తుండడంతో ట్రాఫిక్‌లో చిక్కుకుని సమయానికి గమ్యానికి చేరలేకపోతున్నారు. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించకపోవడంతోనే సమస్య ఎక్కువగా ఉంటోంది. రోడ్డు మార్గాల్లో ప్రయాణించే వారికి నిబంధనల పేరుతో ట్రాఫిక్‌ పోలీసులు చాలానాలు విధించి అపరాధ రుసుము వసూలు చేసే దానిపై ఉన్న శ్రద్ధ సమస్య పరిష్కారం వైపు ఆలోచన చేయడం లేదనే ఆరోపణలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి.
పని చేయని సిగనింగ్‌ వ్యవస్థ
నగరంలో రద్దీ ప్రాంతాలు పెరిగినప్పటికీ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించే సిగలింగ్‌ వ్యవస్థను మెరుగు పరచలేకపోతున్నారు. దీంతో పలు కూడళ్ళలో ట్రాఫిక్‌ అంతరాయం నిత్యకృత్యంగా మారింది. గతంలో ఇంద్రపాలెం జిల్లా పరిషత్‌ సెంటర్‌, బాలాజీ చెరువు సెంటర్‌, జగన్నాథపురం, మున్సిబ్‌ జంక్షన్‌, అన్నమ్మ ఘాటీ తదితరచోట్ల సిగల్స్‌ ఉండేది. ప్రస్తుతం కనుమరుగు కావడంతో తరచూ ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. నగర జనాభా నానాటికీ పెరుగుతోంది. అదే స్థాయిలో వాహనాల సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది. జిల్లా కేంద్రానికి వచ్చేవారు విపరీతంగా పెరుగుతున్నారు. నిర్మాణంలో ఉన్న కాకినాడ బైపాస్‌ రోడ్డు పనులు నిలిచిపోవడంతో మరింత ట్రాఫిక్‌ పెరిగింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే కొంత వరకు సమస్య తీరుతుంది. కొండయ్యపాలెం ఫ్లరు ఓవర్‌, జగన్నాథపురం కొత్త వంతెన నిర్మాణాలు కూడా పూర్తయితే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. వీటిని పూర్తి చేసే విధంగా పాలకులు, అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగరవాసులు కోరుతున్నారు.