Jun 01,2023 19:50

మాట్లాడుతున్న నాయకులు

ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులకు పిఎఫ్‌, ఇఎస్‌ఐ కల్పించాలి

ప్రజాశక్తి - బేతంచెర్ల

లారీ, ట్రాక్టర్‌, ట్రాలీ ఆటో, కార్మికులందరికీ పిఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కమిటీ నాయకులు వైబి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అయినా సందర్భంగా బేతంచెర్ల లారీ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ దగ్గర లారీ యూనియన్‌ ఆఫీస్‌ ముందు కమిటీ సభ్యులు ఎస్‌ ఖాజా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బేతంచర్ల లారీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వైబి వెంకటేశ్వర్లు, లారీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వై ఎల్లయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్‌ఫోర్ట్‌్‌ కార్మికుల పట్ల నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్నాయని అన్నారు. బిజెపి ప్రభుత్వం కొత్తకొత్త జీవోలతో రవాణా రంగాన్ని కుదేలు చేస్తోందన్నారు. డ్రైవర్లకు ఉరితాడు లాంటి జీవో నెంబర్‌ 21ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వాహన డ్రైవర్లకు ఈఎస్‌ఐ, పిఎఫ్‌, 60 సంవత్సరం నిండిన వాహన డ్రైవర్ల అందరికీ పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. హైవేలపై రెస్ట్‌ రూములో నీటి వసతి కల్పించాలని, ప్రతి వంద కిలోమీటర్లకి ఈఎస్‌ఐ సౌకర్యం కలిగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్లు స్వామి నాయుడు, శ్రీనివాసులు, మాలిక్‌ బాషా, మహేశ్వర్‌ రెడ్డి, మల్లయ్య, ఆంధ్ర భోజనం మద్దిలేటి, రాముడు, కుల్లాయప్ప, మధు, ఆశిన్‌ బాష, రామచంద్రుడు, గద్ద గఫార్‌, కోయిలకుంట్ల బాష, తదితరులు పాల్గొన్నారు.