ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. రోడ్డు భద్రత జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో జరిగింది. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లా వైద్యశాల ఏర్పాటయ్యే వరకు ట్రామా కేర్ సెంటర్ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాలను కాలం చెల్లినవిగా పరిగణించి తక్షణమే నిలుపుదల చేయాలని అన్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగానే 250 ఆర్టీసీ బస్సులను కాలం చెల్లినవిగా గుర్తించి నిలుపుదల చేశామని ఆర్టీసీ ఆర్‌ఎం రామారావు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఆ ఉత్తర్వులను పంపాలని అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో రహదారుల విస్తరణ వేగంగా చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరగకుండా సిగలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు.
చీరాల-రేపల్లె మధ్యలోని 216-జాతీయ రహదారి జిల్లాలో 97 కిలోమీటర్ల పొడవున ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒకచోట వాహనాల నిలుపుదల, విశ్రాంతి ప్రాంతం ఏర్పాటు చేయాలనే నిబంధనను ఆయన గుర్తు చేశారు. బాపట్ల జిల్లాలో సుదూర ప్రాంతం జాతీయ రహదారి ఉండగా ఎన్‌హెచ్‌ఎ అధికారులు ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. బాపట్లకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఒకటి ఏర్పాటు చేస్తున్నామని అధికారులు కలెక్టర్‌కు వివరించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి తక్షణమే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 2022 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 645 ప్రమాదాలు జరుగ్గా, 2023లో ఇప్పటివరకు 118 ప్రమాదాలు నమోదయ్యాయన్నారు.
మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని కలెక్టర్ రంజిత్‌బాషా ఆదేశించారు. వారంలో ఒకరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులంతా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో విధిగా పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాహనాల తనిఖీలు మరింతగా పెంచాలన్నారు. బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే వేగ నియంత్రణకు ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు ఎస్పీ మహేష్ తెలిపారు. సమావేశంలో ఆర్టీవో ఏ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ విజయమ్మ, అనుబంధ శాఖల అధికారులు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.










