ప్రజాశక్తి-అచ్యుతాపురం
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గురువారం తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు పిలుపునిచ్చారు. రైతు ట్రాక్టర్ ర్యాలీల విజయవంతానికి అచ్చుతాపురం మునగపాక మండలాల పరిధిలో ఎర్రవరం, ఉప్పవరం, మల్లవరం, ఎం జగన్నాధపురం, సూచికొండ గ్రామాలలో రైతు సంఘం నాయకులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ అన్ని పంటలకు మద్దతు ధరలు చట్టం చేయాలని, సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలని కోరారు. రైతులు, కౌలు రైతుల రుణాల మొత్తం రద్దు చేయాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించాలని, మోటార్లకు బిగించిన మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ ప్రతినిధులు కాండ్రేగుల రామ సదాశివరావు, రంగారావు, సిఐటియు నాయకులు ఎస్ బ్రహ్మాజీ, కె రమణబాబు, దేశం శెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










