Nov 17,2022 23:56

పాడె మోస్తున్న మాజీ మంత్రి గంటా, మాజీ ఎమ్మెల్యే రాజు

ప్రజాశక్తి-బుచ్చయ్యపేట
మట్టితో ఉన్న ట్రాక్టర్‌ తొట్టి తిరగబడటంతో బుచ్చయ్యపేట సర్పంచ్‌ సుంకర సూరిబాబు బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. అజాతశత్రువుగా పేరున్న సూరిబాబు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. సర్పంచ్‌ సూరిబాబు పశువుల షెడ్డు నిర్మాణానికి బుధవారం రాత్రి తన పశువుల పాక వద్ద ట్రాక్టర్లతో మట్టిని వేయిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టరు తొట్టి తిరగబడి ఆయనపై పడింది. ఇది గమనించిన డ్రైవర్‌ స్థానికుల సహాయంతో మట్టిని తొలగించి సూరిబాబును పైకి తీసి ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పోలేపల్లి సమీపంలో ఆయన మృతి చెందారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుచ్చయ్యపేట ఎస్సై కుమారస్వామి కేసు నమోదు చేశారు.
ప్రజల వైద్య సేవలకు ప్రాధాన్యత
గ్రామ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూరిబాబు నిత్యం తపించేవారు. గురువారం విశాఖకు చెందిన కార్పొరేట్‌ ఆసుపత్రి వైద్యులచే గ్రామంలో ఉచిత వైద్య శిబిరానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఇంతలోనే ఆయనను మృత్యువు కబళించింది. గ్రామంలో ఎప్పుడు ఎవరికి అనారోగ్యం ఏర్పడినా వారిని తగిన ఆసుపత్రులలో చేర్పించి ఆరోగ్యం మెరుగయ్యే వరకు వారికి అండగా ఉండే సూరిబాబు ఇక లేడన్న వార్తను గ్రామ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో అత్యవసర వేల వైద్య సేవలకు సహకరిస్తుండడం వల్ల సూరిబాబును అందరూ బుచ్చయ్యపేట అంబులెన్స్‌ అని ఆప్యాయంగా పిలిచేవారు. సూరిబాబు గతంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శిగా ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం విశాఖ డెయిరీ పాల సంఘం అధ్యక్షుడిగా పని చేసియన ఆయన ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికలలో అధికార వైసిపి గాలికి ఎదురొడ్డి సర్పంచ్‌గా గెలిచారు. టిడిపి నేతగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
పాడె మోసిన మాజీ మంత్రి గంటా
సూరిబాబు అంతిమయాత్రలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, చోడవరం మాజీ ఎమ్మెల్యే కెఎన్‌ఎన్‌ఎస్‌.రాజు, టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్య బాబు తదితరులు పాల్గొని పాడే మోశారు. ఒక ముఖ్యమైన కుటుంబీకుడిని కోల్పోయినట్లుగా గంటా తెలిపారు. విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనందకుమార్‌, డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ, డెయిరీ సిబ్బంది, సుగర్‌ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్‌ గూనూరు మల్లు నాయుడు, జడ్పిటిసి సభ్యులు దొండ రాంబాబు, వైసిపి మండల అధ్యక్షులు నాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎస్‌ఎన్‌.రాజు, నాయకులు రేవళ్లు రమేష్‌, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, టిడిపి కార్యకర్తలు, అభిమానులు బుచ్చయ్యపేట తరలివచ్చి సూరిబాబు భౌతికకాయానికి నివాళులర్పించారు.