ప్రజాశక్తి - ఆదోని
ముసాయిదా ఓటరు జాబితాలో పొరపాట్లు ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదోని నియోజకవర్గ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చనిపోయినా లేదా శాశ్వతంగా వేరే ప్రదేశానికి మారినా, వారి ఓట్లు తొలగించడానికి ప్రత్యేక ఫారాలను విడివిడిగా ఇవ్వాలని కోరారు. పై సవరణలన్నీ పూర్తయిన తర్వాత ఎలాంటి తప్పులకూ ఆస్కారం లేకుండా వచ్చే జనవరి 5న ఓటర్ల జాబితా ప్రచురిస్తారని తెలిపారు. ఒకే ఫొటో ఇద్దరు వ్యక్తులపై నమోదైనప్పుడు వాటిని ప్రాథమిక విచారణ జరిపి సమస్య పరిష్కరించాలన్నారు. డెమోగ్రాఫికల్లీ ఎంట్రీకి సంబంధించి ఒక ఓటరు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే వారికి నోటీసు పంపి వారు ఏ చిరునామాకు సంబంధించిన ఓటు హక్కును వినియోగించుకుంటారో వారి వివరాలు తీసుకొని ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఓటు వినియోగించేటట్లు చర్యలు తీసుకోవాలని ఎఆర్‌ఒలను ఆదేశించారు. తహశీల్దార్ వెంకటలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ ఇజాజ్ అహ్మద్, డిఎల్‌పిఒ కార్యాలయ పరిపాలన అధికారి వీరభద్రప్ప, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.