
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సంక్లిప్త సవరణకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ఓటరు జాబితాపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లతో మంగళవారం విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లాలో జరిగే విధానాన్ని ఉన్నతాధికారులకు విన్నవించారు. జిల్లాలో ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితా పై దాదాపుగా సర్వే పూర్తయిందన్నారు. అభ్యంతరాలు, మృతి చెందిన వారి క్లైములు, పరిశీలించి తప్పులు లేని ఓటర్ జాబితాను రూపొందించడానికి తగిన కృషి చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ, సమావేశాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఓకే ఓటు పలుచోట్ల నమోదు కావడంపై చర్యలు తీసుకుంటామని వీఆర్వోలు, బిఎల్‌ఒలు స్వీకరించిన ఫారాలను ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పరిష్కరిస్తున్నామని చెప్పారు. అనంతరం కలెక్టర్ రెవిన్యూ డివిజన్ అధికారులతో మాట్లాడుతూ ఇంటింటి ఓటరు సర్వే పై ఎలాంటి సందేహాలు, సమస్యలు ఎదురైన తన దృష్టికి తేవాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే ఈనెల 15లోగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాలను కచ్చితంగా తనిఖీ చేసి అవసరమైన మేరకు ఆ కేంద్రాలను భవన పరిస్థితులు, మౌలిక సదుపాయాలు కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తిక్, డిఆర్‌ఒ కొండయ్య, ఆర్‌డిఒలు, పుట్టపర్తి భాగ్యరేఖ, కదిరి రాఘవేంద్ర, ధర్మవరం ఆర్డీవో తిప్పేనాయక్, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.