
ప్రజాశక్తి - మక్కువ : తప్పుల్లేని ఓటరు జాబితే లక్ష్యం కావాలని పార్వతీపురం ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలో శుక్రవారం పర్యటించిన ప్రాజెక్టు అధికారి ఓటరు నమోదు అధికారులు, బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు. అక్టోబరు 27న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తామని, ముసాయిదా ఓటరు జాబితాపై క్లైములు, అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరిస్తున్నామన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం రోజుల్లో పోలింగ్ కేంద్రాలు వద్ద బూత్ స్థాయి అధికారులు ఉండాలన్నారు. డిసెంబరు 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇళ్ల నిర్మాణం వేగవంతం కావాలి
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో మంజూరైన ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని పిఒ ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, పేదలు అందరికీ ఇళ్లు సమకూర్చ వలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం జాప్యం జరగరాదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో గహ నిర్మాణ సంస్థ డిఇ సోమేశ్వర రావు, తహశీల్దార్, తదితరులు పాల్గొన్నారు.