ప్రజాశక్తి - సాలూరు : తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు సహకరించాలని సాలూరు నియోజక వర్గ ఓటరు నమోదు అధికారి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్ కోరారు. ఓటరు నమోదు పునశ్చరణ కార్యకలాపాలపై సీతారామ కళ్యాణ మండపంలో శుక్రవారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ ఇంటింటికి ఓటరు ధ్రువీకరణ కార్యక్రమం జూలై 21 నుంచి జరుగుతుందని, ఇంటింటికి వెళ్లి ఓటరు ధ్రువీకరణ చేయడం జరుగుతోందని చెప్పారు. రివిజిన్ వ్యవధిలో బిఎల్‌ఒలతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్‌కు బూత్ లెవల్ ఏజెంట్‌ను నియమించాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సూచించారు. 10 కంటే ఎక్కువ ఫారాలు బిఎల్‌ఒకు సమర్పించకూడదని అన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు సమర్పించిన దరఖాస్తులన్నింటికీ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, సెక్స్ వర్కర్స్, థర్డ్ జెండర్, పిడబ్ల్యుడి, ప్రత్యేకించి బలహీన గిరిజన సమూహం, పివిటిజి, అట్టడుగు వర్గాల ఓటర్లను నమోదు చేయడానికి తీసుకున్న చర్యలను నిర్ధారించడం జరుగుతుందని ఆయన చెప్పారు. సమగ్ర ముసాయిదా జాబిత సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 16 వరకు జరుగుతుందని చెప్పారు. అభ్యంతరాలు, క్లైమ్ లు డిసెంబరు 26 నాటికి పరిష్కరించడం జరుగుతుందని ఆయన చెప్పారు. తుది ఓటరు జాబితాను 2024 జనవరి 5వ తేదీన ప్రచురించడం జరుగుతుందని వివరించారు. అక్టోబరు 17 నుండి నవంబరు 30 వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని అక్టోబరు 28,29 మరియు నవంబరు 18, 29 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. 2023 అక్టోబరు 1నాటికి, 2024 జనవరి 1 నాటికి అర్హత కలిగి నమోదు చేసుకోని అభ్యర్థులను నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. బూత్ స్థాయి అధికారి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని, బిఎల్‌ఒతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు వెళ్లేందుకు రాజకీయ పార్టీలు అధీకత వ్యక్తులకు సంబంధించిన పత్రాలు ఈ నెల 21 లోగా అందించాలన్నారు. 2024 జనవరి 1వ తేదీ నాటికి ఓటరుగా అర్హత పొందే యువత నుండి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో తహశీల్దార్ బాల మురళీకష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










