Sep 26,2023 20:51

తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందించాలి : కలెక్టర్‌

రాయచోటి : ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలు పాటించి తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ ఆర్‌డిఒలు, తహశీల్దార్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ ఓటర్ల జాబితా సవరణపై జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా రూపకల్పనకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అన్ని ఫామ్స్‌ ఒక్కటి కూడా పెండింగ్‌ లేకుండా క్లియర్‌ చేయాలని చెప్పారు. ఫామ్స్‌ క్లియర్‌ చేయడంలో రాజకీయ పార్టీ నాయకులు విమర్శించడానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అతి ముఖ్యమైనదని18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌లతో సంప్రదించి 18 సంవత్సరాలు నిండి వారు ఇంకా ఓటర్‌గా నమోదు చేసుకోకుంటే అలాంటి వారందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చూడాలన్నారు. నియోజకవర్గాల వారీగా జిల్లాలో అర్హులైన ఓటర్లు వందశాతం నమోదు కావాలన్నారు .క్లైమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్స్‌ దరఖాస్తులు ఎవరు తప్పు పట్టకుండా ఉండేటట్లు పరిష్కరించాలన్నారు. ఓటర్‌ లిస్టులో ఒకే రకమైన రెండు ఫొటోలుంటే అలాంటి నకిలీ ఓటర్లను తొలగించాలని, వివాహం అయిన మహిళలు ఇతర రాష్ట్రలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లు గుర్తించి ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం తగు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో పోలింగ్‌ స్టేషన్లపై అభ్యంతరాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలన్నారు.ఎన్నికల నిర్వహణకు కేవలం నాలుగైదు నెలలు మాత్రమే సమయం ఉన్నందున ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌ గా తీసుకొని విధులు నిర్వహించాలన్నారు. అన్నమయ్య నూతన జిల్లాలో 2024 సంవత్సరం ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, రాజంపేట ఆర్డీవో రామకష్ణ రెడ్డి, తహశీల్దార్లు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష