Jul 14,2023 21:11

తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారీకి చర్యలు : గిరీష

రాయచోటి : జిల్లాలో వందశాతం తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యం కావాలని కలెక్టర్‌ గిరీష ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలకు ఉద్బోధించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాలో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2024 అంశంపై ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయా అంశాలకు సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొం దించడానికి బాధ్యతగా కషి చేయాలన్నారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని, ఇక్కడ శిక్షణలో అవగాహన పొందిన తహశీల్దార్లు, ఆర్‌డిఒలు మండలాలలో సూపర్వైజర్లు, బిఎల్‌ఒలకు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో రూపొందిస్తున్న ప్రత్యేక ఎలక్టరోల్‌పై బిఎల్‌ఒలు ప్రతి ఇంటికి వెళ్లి ఖచ్చితంగా పరిశీలన చేసి పటిష్టవంతంగా జాబితా రూపొందించాలని సూచించారు. ఈ క్రమంలో ఏవైనా విజ్ఞప్తులు, తొలగింపులు అందితే అప్పటికప్పుడే వాటిని నమోదు చేసుకొని పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఒకే ఇంట్లో పది మంది ఓటర్ల కంటే ఎక్కువ మంది ఉంటే వాటిని పక్కగా పరిశీలన చేయాలని సూచించారు. ఫామ్‌ 6, 7, 8లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఫామ్‌ 6బిలో ఓటర్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ చేయాలని, జిల్లాలో 90 శాతం మేర పూర్తి చేశారని, మిగిలినవి కూడా పూర్తి చేయాలన్నారు. ఇపి రేషియో, జండర్‌ రేషియో బాగానే ఉందన్నారు. ఒకే రకమైన రెండు ఫోటోలు, డూప్లికేట్‌ ఓటర్లను పక్కాగా తొలగించాలని, ఈ విషయంలో ఆర్డీఓలు, తహశీల్దార్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 18-19 వయసు ఉన్న యువత కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి తగువిధంగా అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గాల వారీగా జిల్లాలో అర్హులైన ఓటర్లు వందశాతం నమోదు కావాలని... ఇందుకు మండలాలలో ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం వివిధ అంశాల్లో తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్డీఓలు రంగస్వామి, మురళి, తహశీల్దార్లు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష