రాయచోటి : జిల్లాలో తప్పులులేని స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందిం చేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ గిరీష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో కలెక్టర్ ఓటర్ జాబితా సవరణపై తహశీల్దార్లు, బిఎల్‌ఒలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపొందించాలన్నారు. దీని వల్ల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి బిఎల్‌ఒలు ఒకటికి రెండు సార్లు ఓటరు లిస్టు పరిశీలించి తప్పులు లేని ఓటర్ లిస్ట్ రూపకల్పనకు కషి చేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధి విధానాల మేరకు జిల్లాలో ఓటర్ జాబితాకు సంబంధించిన కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో డుప్లికెట్ ఓటర్లు, ఇతర ప్రదేశా లకు వలస పోయిన వారు, మరణించిన వారు, కొత్తగా వివాహం అయ్యి వేరే ఊళ్లకు వెళ్లిన వారు, పునరావతం అయిన పేర్లు వంటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫారమ్ -6 ఫారమ్-7, ఫారమ్-8 పెండింగ్‌లు, అన్ ప్రాసెస్డ్ అప్లికేషన్లను ఎప్పటికప్పుడూ పూర్తి చేసి అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఓటర్ల జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి, రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఎపిక్ కార్డుల వంటి అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. కొత్తగా ఓటు నమోదుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 18-19 వయస్సులో ఉన్న వారి జాబితాను తయారీకి ప్రత్యేక దష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని కళాశాలలో వారానికి రెండు రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 18 సంవ త్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను విధులను సక్రమంగా నిర్వహించాలని ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలి
ప్రజాశక్తి-పీలేరు
ఓటరు జాబితాకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన అన్ని దరఖా స్తులను పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ గిరీష సంబం ధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పీలేరు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ జాబితాకు సంబంధించి పెండెన్సీ ఫామ్స్‌పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీలేరు మండలంలో ఓటర్ జాబితాకు సంబంధించిన పెండెన్సీ ఫామ్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు. పెండెన్సీ ఫామ్స్ అన్ని రెండు రోజుల్లోగా క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బిఎల్‌ఒలు ఒకటికి రెండుసార్లు ఓటర్ల జాబితాను పరిశీలించి తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించడానికి కషి చేయాలన్నారు. కార్యక్రమంలో హంద్రీనీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోపాలకృష్ణ, గుర్రంకొండ, కలికిరి, కె.వి.పల్లె, వాయల్పాడు, కలకడ తహశీల్దార్లు ఖాజాబీ, భాగ్యలత, నరసింహులు, ఫిరోజ్ ఖాన్, ప్రదీప్, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.