రాయచోటి : జిల్లాలో తప్పులు లేని స్వచ్ఛమైన ఓటర్ జాబితా రూపొందించడం లక్ష్యం కావాలనికలెక్టర్ గిరీష ఆర్‌డిఒలు, తహశీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని స్పందన హాలులో ఓటర్ జాబితా సవరణ అంశంపై ఆర్‌డిఒలు, తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ, మండల వారీగా ఉన్న జంక్, సున్నా డోర్ నెంబర్ ఓట్లు ఎన్ని గుర్తించారు, అందులో ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత, ఎన్ని కేసులు పరిశీలించారు, ఎన్నింటిని సరి చేశారు, డోర్ నెంబర్ వారీగా ఫామ్-8 ఎంత మంది వద్ద తీసుకు న్నారు, ఇంకా ఎంత తీసుకోవాల్సి ఉంది తదితర అంశాలపై సమీక్షించారు. ఒకే ఇంటిలో పది మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న కేసులు, 100 సంవత్స రాలు పైబడిన వారి కేసులు ఎన్ని, పరిశీలించినవి ఎన్ని, ఇంకను పరిశీలించాల్సిన సంఖ్య తదితరాలపై తాసిల్దార్లతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ బూత్ వారీగా బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి తప్పనిసరిగా ప్రతి ఓటును పరిశీలించాలన్నారు. పోలింగ్ స్టేషన్ వారీగా జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఒక ఇంటిలో ఎన్ని ఓట్లు ఉన్నా ప్రతి ఓటు వివరాలను పరిశీలన చేయాలని తెలిపారు. ఏదైనా మతి చెందిన వారు, అక్కడ లేని వారి వివరాలను పక్కగా నమోదు చేసుకోవాలన్నారు. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మరో పోలింగ్ స్టేషన్ పరిధిలోకి మారి ఉంటే ఆ వివ రాలను కూడా నిర్దేశిత ఫారంలో పక్కగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఒకే ఇంటిలో పది మంది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వాటిని డోర్ నెంబర్ల వారీగా మరొ కసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఓట్ల పరిశీలనలో ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను దష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా పాటించాలని తెలి పారు. క్లెయిమ్స్, అభ్యంతరాలు పక్కాగా పరిశీలించాలన్నారు. ఫామ్-8లో దరఖాస్తుదారు సంతకం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. తొలగింపులకు సంబంధించి ఫారం-7 ఇచ్చినప్పుడు ఫిర్యాదుదారుకు, ఆ కుటుంబానికి రెండు నోటీసులు తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు. ఓటరు జాబితా అంశాలపై వారి వారి పరిధిలో తహశీల్దార్లతో ఆర్‌డిఒలు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆగస్టు 21లోగా ప్రతి ఇంటిలో ఓట్లను తప్పనిసరిగా వెరిఫై చేసి తప్పులు లేని స్వచ్ఛ మైన ఓటర్ జాబితాను రూపొందించాలన్నారు. సమావేశంలో జెసి ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, రాయచోటి, మదనపల్లె, రాజంపేట ఆర్‌డిఒలు రంగ స్వామి, మురళి, రామకృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఎఒ బాలకృష్ణ, తహశీల్దార్ల పాల్గొన్నారు.










