Jul 21,2023 20:56

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పన ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేరికలపై సహకరించాలని కలెక్టర్‌ గిరీష వివిధ రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నందు ఓటర్ల జాబితా సవరణపై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ గిరీష పిఎస్‌ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 21వ తేదీ నుండి నెల రోజులపాటు బిఎల్‌ఒలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు, తొలగింపులు, స్త్రీ పురుష నిష్పత్తి, బోగస్‌ ఓట్లు, తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల నమోదు పారదర్శకంగా చేపట్టి ఓటర్ల జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి బూత్‌ స్థాయి ఏజెంట్లు కూడా పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలన్నారు. సుమోటోగా ఓటర్లను తొలగించడం కానీ, చేర్చడం గానీ ఉండదని ప్రతి అంశాన్ని బిఎల్వోలు జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేస్తారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బిఎల్‌ఎలను నియమించుకొని అందుకు సంబంధించిన జాబితా తమకు పంపాలన్నారు. 18 నుండి 19 సంవత్సరాల లోపు యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక దష్టి సారించాలని కలెక్టర్‌ అధికారులకు తెలిపారు. ఓటర్లు ఓటరు జాబితాలో తమ ఓటు ఉందో లేదో చూసుకుని ఓటు లేకపోతే వెంటనే నమోదు చేసుకోవాలన్నారు.జనవరి-1, 2024కి, 18 ఏళ్లు వచ్చేవారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చునన్నారు.ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనల మేరకు మాత్రమే తొలగింపులు, చేర్పులు ఉంటాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జిల్లాలో 20 జులై 2023 నాటికి 668552 మంది పురుషులు, 685071 మంది స్త్రీలు, 136 మంది హిజ్రాలు మొత్తం 1353759 మంది ఓటర్లుగా నమోదు కావడం జరిగిందన్నారు. ప్రస్తుతం పోలింగ్‌ స్టేషన్లు 1577, బిఎల్‌ఒలు 1577 మంది ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఓటరు జాబితా ప్రధాన భూమిక పోషిస్తుందని, జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.