రాయచోటి : తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని కలెక్టర్ గిరీష వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఓటర్ల జాబితా సవరణపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పన ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేరికలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నెల రోజులపాటు బిఎల్‌ఒలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఇంటింటి సర్వే 97 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఫామ్-7, ఫామ్-8లను జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల సహకారం కూడా అందించాలన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు, తొలగింపులు, స్త్రీ పురుష నిష్పత్తి, బోగస్ ఓట్లు, తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. బిఎల్‌ఒలు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల నమోదు పారదర్శకంగా చేపట్టి ఓటర్ల జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయడం వల్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఇందుకు సంబంధించి బూత్ స్థాయి ఏజెంట్లు కూడా పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని పేర్కొన్నారు. సుమోటోగా ఓటర్లను తొలగించడం కానీ, చేర్చడం గానీ ఉండదని ప్రతి అంశాన్ని బిఎల్వోలు జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేస్తారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బిఎల్‌ఎలను నియమించుకొని అందుకు సంబంధించిన జాబితా తమకు పంపాలన్నారు. జిల్లాలో ముఖ్యంగా 18 నుండి 19 సంవత్సరాల లోపు యువ ఓటర్ల నమోదుకు రాజకీయ ప్రతినిధులు ప్రత్యేక దష్టి సారించాలని తెలిపారు. ఓటర్లందరూ ఓటరు జాబితాలో తమ ఓటు ఉందో లేదో ఒకసారి చూసుకుని ఓటు లేకపోతే వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. జనవరి-1, 2024కి, 18 ఏళ్లు వచ్చేవారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చునన్నారు. వచ్చే ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఓటరు జాబితా ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించి ఓటర్లకు అవగాహన కల్పించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి సంబంధిత అధికారులు బిఎల్‌ఒలు బాగా పనిచేస్తున్నారన్నారు. ఎన్నికల వరకు అధికారులందరూ ఇలాగే పని చేయాలన్నారు. కార్యక్రమంలో డిఅర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, రాజంపేట మదనపల్లి ఆర్‌డిఒలు రంగస్వామి, రామకృష్ణారెడ్డి, మురళి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. స










