
ప్రజాశక్తి-విజయనగరం, బొండపల్లి : ఓటర్ల జాబితాల్లో ఎలాంటి తప్పులూ లేకుండా తయారు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి.. బిఎల్‌ఒలను ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఓటర్ల జాబితాలకు పూర్తి బాధ్యత బిఎల్‌ఒలదేనని స్పష్టంచేశారు. కెఎల్‌పురంలోని 23, 24 పోలింగ్ స్టేషన్లను, గొట్లాం జిల్లా పరిషత్తు హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద చేపడుతున్న ప్రత్యేక శిబిరాన్ని శనివారం కలెక్టర్ సందర్శించారు. బిఎల్‌ఒలను అడిగి ఓటర్ల జాబితాలను పరిశీలించారు. జాబితాలో అక్కడక్కడ ఫొటోలు లేకుండా ఉన్న ఓటర్లను గమనించి ఫొటోలను తప్పకుండా అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఫారం-6 , ఫారం-8 ఎన్నెన్ని వచ్చాయి? ఎలా పరిష్కరించారని ప్రశ్నించారు. వందేళ్లు దాటిన వారు ఎంత మంది ఉన్నారని అడిగారు. మరణించిన ఓటర్లు డూప్లికేషన్లు లేకుండా చూడాలన్నారు. ప్రత్యేక శిబిరాల తర్వాత ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాల క్రాస్‌చెక్ చేసి చూడాలని అన్నారు. ఇరుపార్టీల బిఎల్‌ఎలతో మాట్లాడి స్పెషల్ కాంపెయిన్ ఎలా జరుగుతుందని అడిగారు. అర్హులైన వారందరినీ ఓటర్లుగా చేర్పించాలని కోరారు. గొట్లాం జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్‌ఎంతో మాట్లాడారు. బయట ఎందుకు తరగతులను నిర్వహిస్తున్నారని అడిగారు. నాడు-నేడు భవనాలు నిర్మాణంలో ఉన్నాయని, 9, 10వ తరగతుల విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నామని హెచ్‌ఎం తెలిపారు.