ఎండు పుల్లలను కంట్లోకి తోసుకొని
వేదనాభరిత వాక్యాన్ని
నిర్మించే ప్రయత్నం చేస్తున్నాను
మాటలు రాజేసుకున్న ప్రతిసారీ
అగ్గి రవ్వలు దృశ్యాలను మాడ్చేస్తాయి
అదీ
ఇంతకు మునుపు చూసిందే
మళ్ళీ మళ్ళీ జరుగుతుందని తెలిసి కూడా
పోగు చేయడం తప్పే!
అందుకే
ఒక దృశ్యం నుంచి మరో దృశ్యంలోకి
ఒక అచేతనమైన పని నుంచి
చైతన్యపు దిశల్లోకి తప్పుకోవాలి
తప్పుకోవడం తప్పేమీ కాదు
ఒక వైపు నుంచి మరో వైపుకు
చూపు తప్పుకున్నట్టు గాలి మసలినట్టు
చుక్కలు జారే వేళలోనో
ఆకాశపు పిండం పగులుతున్నప్పుడో-
తప్పుకోవాలి
తప్పుకోవడమంత ఉన్నతమైన కార్యం ఏమైనా ఉందా?
పగిలిపోయిన ప్రదేశాల్లో
కాస్త స్ఫూర్తిని నాటి తప్పుకోవాలి
నేను ఉన్నానని చెప్పడానికి
గొంతు చించుకొని అరవటమెందుకు?
ఏదో చేస్తానని తెలుపడానికి
ఎవరి మానసిక స్థితినో
హత్య చేయడమెందుకు?
ఎవరు తప్పుకోవాలన్నది
ప్రశ్న ఎలా అవుతుంది?
కొన్నిసార్లు లేదా కొన్ని చోట్ల
నువ్వో నేనో ...!
- లై, 94919 77190