
ప్రజాశక్తి-చోడవరం
మండలంలోని గౌరీపట్నం గ్రామంలో సర్వే నెంబర్ 84-1బి, సర్వేనెంబర్ 117లో కోన కన్నాపాత్రునికి చెందిన 77 సెంట్లు భూమిని రెవెన్యూ అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించి అదే గ్రామానికి చెందిన తోట వెంకట సత్యవతికి కట్టబెట్టడంపై సిపిఎం ఆధ్వర్యంలో శనివారం స్థానిక తహశీల్దారు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ తప్పుడు రికార్డులు సృష్టించి భూమిని వేరొకరికి కట్టబెట్టిన రెవెన్యూ సిబ్బందిపైనా, సహకరించిన తహశీల్దారుపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులు కన్నాపాత్రుడు, నూకన్నపాత్రుడు మాట్లాడుతూ ఈ విషయంపై అధికారులకు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోకుండా తమ భూమిని మరొకరు పేరుపై ఆన్లైన్ రికార్డు నమోదు చేస్తున్నారని వాపోయారు. వెంటనే తమ భూమిని తమ పేరుతో ఆన్‌లైన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్ దేముడు నాయుడు, ఎస్‌వి.నాయుడు, ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.