Oct 10,2023 21:04

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి

రాజంపేట అర్బన్‌ : ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఎవరైనా ఐదుకు మించి క్లైములు ఇచ్చినా, తప్పుడు ఫిర్యాదులు చేసినా అటువంటి వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీ నాయకులతో ఓటర్ల జాబితా చేర్పులు, మార్పులు తొలగింపులపై వచ్చిన ఫిర్యాదులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. టిడిపి మద్దతుదారుల ఓట్లను తొలగించడానికి ఆన్‌లైన్‌ చేసిన వారి వివరాలను తెలపాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు కోరారు. తాము ఇప్పటివరకు 14 వేల క్లైములు ఇచ్చామని, 3500 క్లెయిమ్‌లను రిజెక్ట్‌ చేశారని పేర్కొన్నారు. అవి ఎందుకు రిజక్ట్‌ చేశారో?, ఏ కారణాలు చేత రిజక్ట్‌ చేశారో తమకు వివరాలు తెలపాలని ఆర్‌డిఒ దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పటి నుంచి టిడిపి శ్రేణులకు చెందిన 891 మంది ఓటర్లను తొలగించాలని టిడిపి వారే ఫిర్యాదు చేసినట్లు తప్పుడు క్లెయిములు ఆన్‌లైన్‌ చేసి మీకు పంపించారని, వారందరిపై క్రిమినల్‌ కేసులు బనాయించి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 1716 క్లేయిములను పెండింగ్‌లో పెట్టారని ఆ క్లైములు ఎందుకు పెండింగ్‌లో పెట్టారో వివరాలు తెలియజేయాలని కోరారు. ఓట్లు తొలగింపునకు వైసిపి నాయకులకు సహకరిస్తున్న అధికారులపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, ఇక అధికారులపై కోర్టుకు వెళ్లి న్యాయస్థానంలో న్యాయం కోసం పోరాటాలు సాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, కాంగ్రెస్‌, వైసిపి నాయకులు పాల్గొన్నారు.