Oct 05,2023 00:32

సమీక్షలో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌-2024 ఓటర్ల జాబితా రూపొందించడానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధుల భాగస్వామ్యంతో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా చేపడుతున్నామని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌.ఎస్‌.ఆర్‌ 2024కు సంబంధించి ఓటర్ల జాబితాలో ఓటు నమోదు, తొలగింపులు, మార్పులపై అందిన దరఖాస్తుల వివరాలను నియోజకవర్గ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ప్రతివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగే సమావేశంలో అందిస్తామన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల జాబితాపై ఉద్దేశపూ ర్వకంగా తప్పుడు ఫిర్యాదులు అందిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు సంబంధించి ఓట్లు నమోదు, తొలగింపులపై అందించిన అభ్యంతరాలు విచారణలో తప్పు అని తేలితే ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదులు అందించారని భావించి ఈసీఐ యాక్ట్‌ సెక్షన్‌ 31 ప్రకారం సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశిం చారన్నారు. ఈ విషయంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు మండల స్థాయి నాయకులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, బిఎస్‌పి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ సిహెచ్‌.వాసు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.భాస్కరరావు, కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బిళ్ళా సునీల్‌, టిడిపి ప్రచార కార్యదర్శి ఎన్‌.ఓంకార్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు లలితా, కె.స్వాతి, నగరపాలక సంస్థ అదనపు కమిష నర్‌ పెద్ది రోజ, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్‌, తహశీల్దార్‌ సిద్దార్ధ, కో-ఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ కల్యాణి పాల్గొన్నారు.
ఆరోగ్య సురక్షను నిరంతరం పర్యవేక్షించాలి
ప్రజలకు ఇంటి ముంగిటకే మెరుగైన వైద్య సేవలను అందించేందుకు నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను వైద్య ఆరోగ్య శాఖాధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు, తహశీల్దార్లు సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరం నుండి అభివృద్ధి, సంక్షేమ కారక్రమాలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సురక్ష వైద్య శిబిరం ముగిసే వరకు ప్రత్యేకాధికారులు మున్సిపల్‌ కమిషనర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిడిఒలు, తహశీల్దార్లు అక్కడే వుండి బాధ్యతగా ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో నూరు శాతం జీఈఈఆర్‌ సాధించేందుకు అన్ని క్లస్టర్లలో డ్రాప్‌ ఔట్స్‌ లేకుండా ఐదు నుండి 18 ఏళ్లలోపు వారంతా విద్యా సంస్థల్లో చేరేలా ఎంఇఒలు, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వాలంటీర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. చైల్డ్‌ఇన్ఫో, ఎడ్యుకేషన్‌ సర్వే అనుసంధానంలో ఉత్పన్నమైన సాంకేతిక సమస్యల ద్వారా పెండింగ్‌లో వున్న విద్యార్థుల వివరాలకు సంబంధించి రిమార్కులు రాసి గురువారం నాటికి సర్వే పూర్తి చేయాలన్నారు.