Oct 08,2023 21:35

పోలీసులకు జెడ్‌పిటిసి సభ్యులు పెద్దిరాజు ఫిర్యాదు
ప్రజాశక్తి - పోడూరు

             సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, కుల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కుట్రలు పన్నుతున్న టిడిపి కొవర్ట్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరు పెద్దిరాజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండలానికి చెందిన పార్టీ నాయకులతో కలిసి ఆదివారం ఆయన స్థానిక ఎస్‌ఐ డి.రామకుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాను దళితులను దూషించినట్లుగా లేనిపోని అపనిందలతో ఈ నెల 7వ తేదీన పాలకొల్లు పట్టణానికి చెందిన టిడిపి కోవర్టు బుంగ తిరుమలరాజు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినట్లు పెద్దిరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. జిన్నూరు గ్రామానికి చెందిన గిరిగి గోపాలకృష్ణ, పాలమూరుకు చెందిన బుంగ పవన్‌లు తిరుమల రాజుకు సహకరించి తనను కించపరిచి ఆత్మాభినాన్ని దెబ్బతీసే విధంగా కుట్ర పన్నుతున్నారని పెద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ముగ్గురిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దిరాజుతో పాటు వైసిపి మండల ఇన్‌ఛార్జి కలిదిండి గణపతిరాజు, జెసిఎస్‌ కన్వీనర్‌ బల్ల రాజశేఖర్‌, ఎపి హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పెద్దపాటి పెద్దిరాజు, ఎపి సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పోతుమూడి రామచంద్రరావు, పోడూరు సర్పంచి శెట్టిబత్తుల సువర్ణరాజు, జున్నురు, పెనుమాదం సొసైటీ ఛైర్మన్లు డిటిడిసి బాబు, కొరపాటి వీరస్వామి ఉన్నారు.